కర్ణాటక తరహాలోనే తెలంగాణలో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు హస్తం పెద్దలు. అందుకే అక్కడ అనుసరించిన స్ట్రాటజీనే ఇక్కడా అమలు చేయబోతున్నారు. కర్ణాటక తరహాలోనే క్యాంపెయిన్ స్ట్రాటజీ రెడీ అవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. సోషల్ మీడియా సహా కాంగ్రెస్ క్యాంపెయిన్ మొత్తాన్ని ఇదే డీల్ చేస్తుంది. ఈ వార్‌రూమ్‌కు ఇన్‌ఛార్జ్‌గా శశికాంత్ సెంథిల్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మాజీ ఐఏఎస్ అధికారి కర్ణాటకలో కాంగ్రెస్‌లో క్యాంపెయిన్ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. అందుకే తెలంగాణలోనూ ఆ బాధ్యతలను ఆయనకే అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడైనట్లు తెలుస్తోంది. 2019లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన శశికాంత్ సెంథిల్ కుమార్ 2020లో కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్, ప్రియాంకలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కర్ణాటకలో ఈ టీమ్ ఎఫర్ట్‌పై కాంగ్రెస్ పెద్దలంతా ప్రశంసలు కూడా కురిపించారు.
డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర. అందుకే ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారానికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరైతే సోషల్ మీడియాను ఎఫెక్టివ్‌గా వాడుకుంటారో వారిదే గెలుపు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరే అవకాశం సోషల్ మీడియాతోనే సాధ్యం. ప్రతిపక్షంపై విమర్శలైనా, తమ హామీలైనా ఏదైనా సరే బలంగా జనానికి చేరాలంటే ఇదొక్కటే మార్గం. తిమ్మిని బమ్మిని చేయాలంటే ఇంతకు మించిన మార్గం లేదు. 2014 నుంచి బీజేపీ కూడా సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటోంది. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కేవలం ప్రచారం కోసమే ఓ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది. బలంగా యువతను చేరగలిగింది. 40శాతం కమిషన్ నినాదం జనంలోకి చేరేలా బలమైన ప్రచారాన్ని నిర్వహించింది సెంథిల్ కుమారే. బొమ్మై సర్కార్ అవినీతి సర్కార్ అన్న నినాదాన్ని బాగా జనంలోకి తీసుకెళ్లగలిగారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై ఆయన కసరత్తు చేస్తున్నారు.
సెంథిల్ కుమార్‌కు తెలంగాణపై కొంత అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వార్‌రూమ్ బాధ్యతలు బాధ్యతలు తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. శశికాంత్ సెంథిల్ కుమార్‌కు 40మందితో ఓ స్పెషల్ టీమ్ ఉంది. సోషల్ మీడియా పోల్ స్ట్రాటజీలపై వీరికి గట్టి పట్టుంది. ఇప్పటికే సెంథిల్ టీమ్ తన పని మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, గత ఎన్నికలు, కాంగ్రెస్ ఓట్ షేర్, పబ్లిక్ సెంటిమెంట్ వంటి వివరాలతో రిపోర్టులు సిద్ధమవుతున్నాయి. థర్డ్‌పార్టీ సర్వేలు కూడా చేయిస్తున్నారు. వాటి ఆధారంగా ఈ టీమ్ తమ వ్యూహాలకు పదును పెట్టనుంది.
సెంథిల్ కుమార్ ఆగస్టులో తెలంగాణకు వస్తారని చెబుతున్నారు. ఇక్కడి నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ తర్వాత వార్‌రూమ్‌ను సెట్ చేసి రంగంలోకి దిగుతారు. గాంధీభవన్‌లో కాకుండా మరో ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. చూడాలి ఈ టీమ్ తెలంగాణలో కాంగ్రెస్ భవితవ్యాన్ని మార్చగలదో లేదో..!