BRS : బీఆర్ఎస్ కు వలసల భయం ! కాంగ్రెస్ వైపు సెకండరీ కేడర్ చూపు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ లో కొందరు నేతలు మనసు మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ కదా.. అని వెనకా ముందు చూసుకోకుండా.. అంతకుముందు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు కొందరు లీడర్లు.

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ లో కొందరు నేతలు మనసు మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ కదా.. అని వెనకా ముందు చూసుకోకుండా.. అంతకుముందు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు కొందరు లీడర్లు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో.. కారు ఎక్కిన నేతలంతా దిగిపోవాలని డిసైడ్ అయ్యారు. సెకండరీ కేడర్ అంతా బ్యాక్ టు పెవిలియన్ అంటుండటంతో గులాబీ పెద్దల్లో భయం పట్టుకుంది.

తెలంగాణ వచ్చాక పదేళ్ళ పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేల దాకా అవసరం ఉన్నా.. లేకున్నా తమ పార్టీలోకి చేర్చుకుంది గులాబీ పార్టీ. అధికార పార్టీలో ఉంటే.. కాంట్రాక్టులు వస్తాయి.. నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చని ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్థానిక సంస్థల దాకా అందరూ కారు ఎక్కేశారు. దాంతో గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇప్పుడు అధికారం మారిపోయింది.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ కు పవర్ వచ్చింది. స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా గులాబీ పార్టీలో ఉండటం ఎందుకు అనుకుంటున్నారు చాలామంది. అందుకే గ్రామస్థాయి లీడర్లంతా వలసలకు రెడీ అవుతున్నారు.

మున్సిపాలిటీల్లో కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి దూకుతున్నారు. బీఆర్ఎస్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల్లో మళ్ళా నో కాన్ఫిడెన్స్ మోషన్స్ రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్, సహకార ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతర పనులు కావాలంటే అధికార పార్టీ అండ ఉండాలి. అందుకే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిపోతే బెటర్ అని భావిస్తున్నారు.

స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ దాకా సెకండరీ లీడర్లంతా అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళిపోతే అడ్డుకోవడం బీఆర్ఎస్ అధిష్టానం వల్ల కూడా కాదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ సెకండరీ కేడర్.. హస్తం పార్టీలోకి జంప్ చేసే అవకాశముందని తెలుస్తోంది.