Jonnavittula: ఏపీలో మరో రాజకీయ పార్టీ.. అవసమంటారా జొన్నవిత్తుల సార్..

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అంతరించబోతోంది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు భాష, పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నానని అంటున్నారు. పార్టీ పేరు జై తెలుగు పార్టీ అని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 06:21 PM IST

రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీ పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందని.. అది చూసి తట్టుకోలేకే పార్టీ పెడుతున్నానని అంటున్నారు జొన్నవిత్తుల. మన సంస్కృతిని, భాషను మనమే కాపాడుకోవాలంటున్న ఆయన.. రాష్ట్రంలో నాయకులు, జనాలను చైతన్య వంతుల్ని చేసేందుకే పార్టీ పెడుతున్నానని చెప్పారు. తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పం అని అన్నారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. జొన్నవిత్తుల పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది.

ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ- జనసేన ఒక కూటమిగా వస్తాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వారాహి యాత్రలో ఉన్న పవన్.. ఈసారి తనను సీఎంను చేస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ జనాలను వేడుకుంటున్నారు. ఇప్పుడు జొన్నవిత్తుల పార్టీ.. ఓ వర్గానికి చెందిన జనాలపై ప్రభావం చూపుతుందా.. ఈ పార్టీ ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తుందా అనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎలాంటి చర్చ జరుగుతున్నా.. జొన్నవిత్తుల సార్ మనకు రాజకీయాలు ఎందుకు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

రాజకీయాలు అంటే బురద. మాటలు హద్దులు దాటి పేలుతుంటాయ్. అవన్నీ తట్టుకునే శక్తి మీకుందా అని ప్రశ్నించే వాళ్లు కొందరయితే.. ఇప్పటికిప్పుడు మీరు పార్టీ పెట్టినా పట్టించుకునే దిక్కు అయినా ఉంటుందా అని క్వశ్చన్‌ చేసే వాళ్లు ఇంకొందరు. అప్పుడెప్పుడో ఆర్జీవీ ఓ మాట అన్నాడని అగ్గి మీద గుగ్గిలం అయి.. టీవీల ముందు బల్లలు విరగ్గొట్టిన చరిత్ర ఉంది జొన్నవిత్తులది! ఆర్జీవీలాంటి వాళ్లు.. ఆర్జీవీలా మాటలు సంధించేవాళ్లు రాజకీయాల్లో చాలామందే ఉంటారు. వారందరినీ దాటుకుంటూ రాజకీయం చేయడం సాధ్యమేనా.. పార్టీని నడిపించడం అయ్యే పనేనా.. పవన్‌ లాంటివాడే తొమ్మిదేళ్లుగా ఖాళీగా కనిపిస్తున్నాడు. మీరొచ్చి ఏం చేస్తారు అనే డిస్కషన్ మొదలైంది.