ప్రశాంతతకు నిలయమైన తెలుగురాష్టాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. మనిషి తన స్వార్ధం కోసమే చేసిన దుర్మార్గపు పనుల వల్ల రెండు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా నిలిచే బెజవాడ.. ఒరుసుకుపోయిన పసిపాపలా అయింది. ప్రకృతి కోపానికి కమిలిపోయింది. ఎప్పుడు, ఏ వైపు నుంచి కారుమేఘాలు కమ్మేస్తాయో అని, బుడమేరు ఇంకెంతగా విరుచుకుపడుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండమీది దుర్గమ్మను మాత్రమే కాదు ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు బెజవాడ ప్రజలు. శాంతించు తల్లి, కాపాడు అమ్మా అంటూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను కన్నీళ్లతో మొక్కుకుంటున్నారు సామాన్యులు. విజయవాడ,గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల కన్నీళ్లు కొలవాలంటే లెక్కకు అందదు. అంతలా ఉంది దుస్దితి. బెజవాడ పరిసర ప్రాంతాల దయనీయస్ధితి ఇలా ఉంటే.. ఉద్యమాల ఖిల్లాగా చెప్పుకునే ఖమ్మం పరిస్ధితి ఇలాగే ఉంది. ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వాగు ముంచెత్తితే, మర్రిపెడ బంగ్లా పరిసర ప్రాంతాలను ఆకేరు వాగు చుట్టేసింది. మధిర నియోజకవర్గంలోనూ ఇదే దుస్ధితి.ఒక్కమాటలో చెప్పాలంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల అష్ట కష్టాలు చెప్పుకోలేనివిగా, రాయాలంటే కన్నీళ్లు అడ్డు పడేంతగా ఉన్నాయి.
అయితే ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు భయాన్ని పుట్టిస్తుంటే… వరదలోనూ బురద రాజకీయాలు జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షాలైనా తమ సహజ స్వభావాన్ని వదులుకోలేక నానా తంటాలు పడుతున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కాస్తమాట్లాడుకుంటే… న్యాచురల్ గానే దేశ రాజకీయాలు ఒక ఎత్తు. తెలుగు రాజకీయాలు మరొక ఎత్తు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అయితే కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు. అయితే మాయదారి వరద తాండవం చేస్తున్న ఈ సమయంలోనూ ఏపిలో కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీలు వరద రాజకీయానికి తెరలేపాయి. కాదు కాదు బురద రాజకీయం చేస్తున్నాయి. సహాయకచర్యల్లో తలమునకలైన టిడిపిని తూర్పారపడుతోంది వైసీపీ.
బాధితులను ఆదుకోవడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతలు చిన్న చిన్నలోపాలను వెతికి మరీ రచ్చ రచ్చ చేస్తున్నారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసానికి ఏమి కాకూడదనే..బుడమేరు వాగు పాలిటిక్స్ చేస్తున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తే…. ఇంత తెలివిలేని వ్యక్తి అసలు సీఎంగా ఎలా పని చేసాడంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇదే అదనుగా భావించిన టిడిపి, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. టిడిపి అఫిషీయల్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు కామెంట్లు పెడుతోంటే… ఎక్కడా తగ్గకుండా రివర్స్ అాటాక్ చేస్తోంది వైసీపీ. దరిద్రులు అక్రమార్కులు మీరంటే మీరు అంటూ సోషల్ మీడియా వేదికగా బూతుల దాడి చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ, నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ క్యాడర్ ఎద్దేవా చేస్తోంటే… ప్యాలెస్ వచ్చి బురదలో దిగినందుకు సైకో ఎంతగా ఫీల్ అవుతున్నాడో అని కౌంటర్లు ఇస్తూ కామెంట్లు, పోస్టులతో తిట్టుకుంటున్నారు టిడిపి, వైసీపీ క్యాడర్లు.
ఇటు తెలంగాణలోనూ బురద రాజకీయం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ టీఆరెస్ ఎక్కడా తగ్గటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట, వరంగల్, ఖమ్మంతో పాటు మరికొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు ధైర్యం చెప్పారు. నష్టపరిహారం మాత్రమే కాకుండా తక్షణ సహాయం కూడా ప్రకటించారు. అధైర్య పడకండి నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు వానకు ఎదురెళ్లి మరీ పెద్దన్న పాత్ర పోషించారు. అంతటితో ఆగలేదు. ప్రెస్ మీట్ పెట్టి TRS మీద విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ అసమర్ధ పనితీరు వల్లే ఇదంతా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్. ఖమ్మానికి వరద ముంపు మాజీమంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణల వల్లే అని… ఇక్కడ కూడా హైడ్రా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఘాటుగానే స్పందించారు. దీంతో TRS నుంచి హై రేంజ్ లోనే వచ్చింది రియాక్షన్.. అధికారంలో ఉండి ప్రజలను ఎలా ఆదుకోవాలో చేతకాక సీఎం రేవంత్ ఇలా దిగజారి బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ నేతలు. పోటాపోటీ టూర్స్‌లో భాగంగా హరీష్ రావు, నామనాగేశ్వర్రావు , పాడికౌశిక్ రెడ్డి ఖమ్మం వెళితే… విరుచుకుపడ్డారు కాంగ్రెస్ క్యాడర్. హరీష్ రావు కాన్వాయ్ టార్గెట్ గా రాళ్ల దాడి చేసారు. ఇందులో నామనాగేశ్వర్రావు కారు ధ్వంసం అయింది. తెలంగాణ బురద రాజకీయం ఇలా ఉంది మరి. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో, దయనీయ దుస్ధితిలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అంతా సహాయక చర్యల్లో మునిగిపోవాలి. వరద మింగి అవశేషాలు మిగిల్చిన చోట మేమున్నామంటూ అన్ని రాజకీయ పార్టీలు పెద్దన్ పాత్ర పోషించాలి. ఆరోపణలు,ప్రత్యారోపణలు, విమర్శలు అన్నింటిని కట్టకట్టి… వరదలో విసిరేసి ఆపదలో ఉన్నవాడి కోసం ఉద్యమించాలి. కానీ ఇక్కడ ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వరద సహాయకచర్యలను వదిలేసి…బురద రాజకీయం చేస్తున్నారు ఇది అత్యంత బాధాకరం. సోషల్ మీడియా వారియర్స్ అంతా సేవకుల్లా మారాల్సిన అత్యవసర సమయమిది. అలా కాదు యథారాజా తధా ప్రజా అంటారా.. అనుకుంటారా..బీ కేర్ ఫుల్ ప్రజలు అన్నీ గమనిస్తారు. సమయం వచ్చినట్లు ఓటుతో చాచికొడతారు. పొలిటికల్ పార్టీల అధినేతల్లారా జర సోచో..