ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. జగన్‌ను అలా చూసి.. చాలామంది పాపం అనేశారు కూడా ! సభకు ఇలా వచ్చారు.. ప్రమాణస్వీకారం చేసి అలా వెళ్లిపోయారు. ఈ మాత్రం దానికి ఎందుకొచ్చారు.. అంత త్వరగా ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ జరుగుతున్న వేళ.. ఒక్క విషయంలో మాత్రం ప్రతీ ఒక్కరినీ సస్పెన్స్ వెంటాడుతోంది. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి వచ్చిన జగన్.. అసెంబ్లీ వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి వెళ్లారు. సీఎంగా ఉన్న టైంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా జగన్ సభకు వచ్చేవారు. ఐతే ఈసారి మాత్రం రూటు పూర్తిగా మార్చేశారు. దీనికి కారణాలు ఏంటా అనే అనుమానం ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది.
ఐతే అసెంబ్లీకి వచ్చే సమయంలో అమరావతి రైతులు నిరసన తెలుపుతారని జగన్ ఆలోచించారని తెలుస్తోంది. అందుకే వేరే మార్గంలో అసెంబ్లీకి వచ్చినట్లు సమాచారం. ముందుగా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా.. జగన్ మాత్రం లోపలికి వెళ్లలేదు. ఆయన సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్లారు. జగన్ సభలోకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో చివరి బెంచ్‌లో ఐదు నిమిషాల పాటు కూర్చున్నారు. ఆయనతో పాటు పక్కనే వైసీపీ ఎమ్మెల్యేలు వారి, వారి స్థానాల్లో కూర్చున్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డితో పాటుగా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ జగన్ ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ నమస్కారం చేస్తూ వెళ్లారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో.. ఆయన కూడా ప్రతి నమస్కారం చేశారు. అంతకముందు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అసెంబ్లీలోని ఛాంబర్‌లో సమావేశం అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడు జగన్ సభలోకి అడుగుపెట్టారు.. ప్రమాణం చేసిన తర్వాత ఆయన సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయల్దేరి తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో.. కొందరు ఆకతాయిలు జగన్ మావయ్యా అంటూ పెద్దగా కేకలు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.