G20 Summit 2023: జీ20 సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలు వీళ్లే.. గైర్హాజరవుతోందెవరంటే..

అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలు దేశాధినేతలు సదస్సుకు హాజరవుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జీ20 సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్ వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది. వారిలో కొందరు హాజరు కావడం లేదు.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 02:00 PM IST

G20 Summit 2023: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు శనివారం (సెప్టెంబర్ 9) ప్రారంభం కానుంది. ఢిల్లీలో శని, ఆదివారాల్లో జరిగే ఈ సదస్సు కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలు దేశాధినేతలు సదస్సుకు హాజరవుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జీ20 సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్ వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది. వారిలో కొందరు హాజరు కావడం లేదు.
అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్, జర్మన్ ఛాన్స్‌లర్ ఒలఫ్ షోల్జ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస, టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే, అగ్రదేశాలైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సదస్సుకు హాజరు కావడం లేదని తెలిపారు.

పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో, ఆయన భారత్‌కు రావడం లేదని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యక్తిగత కారణాలతో హాజరుకావడం లేదు. 2008లో మొదటిసారి జీ20 సమావేశం జరిగినప్పటి నంచి ప్రతిసారీ ఆయన హాజరయ్యారు. ఈసారి మాత్రమే సమావేశాలకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా సోకిన కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్‌షెజ్‌ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అలాగే మెక్సికో అధ్యక్షుడు యాండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఆబ్రడార్ కూడా తాను సమావేశాలకు రావడం లేదని తెలిపారు.
కీలక చర్చలు
జీ20 సదస్సులో అజెండాలోని అంశాలతోపాటు వివిధ దేశాధి నేతలు పరస్పర చర్చలు జరుపుతారు. జో బైడెన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం ప్రభావం, పేదరిక నిర్మూలన, వాతావరణ అంశాలు వంటివాటిపై ఇరువురూ చర్చిస్తారు. ఇక భారత సంతతికి చెందిని రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని అయ్యాక ఇండియా రానుండటం ఇదే మొదటిసారి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద జీ20 సదస్సు వేదికగా ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతున్న సైనిక చర్యను ఖండించబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కూడా జీ20 వేదికగా ఉత్తర కొరియా కవ్వింపు చర్యల్ని ఖండించబోతున్నారు. ఇలా అనేక దేశాధినేతలు జీ20 అజెండాతోపాటు, పలు అంతర్జాతీయ అంశాలు, సొంత అంశాలపై మాట్లాడబోతున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి ఈ సదస్సుపై ఉంది. ఇప్పటికే వివిధ దేశాధినేతలు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. శుక్రవారం రాత్రి వరకు నేతలు ఢిల్లీ చేరుకుంటారు.