Gandhi Peace Prize: ఉత్తరప్రదేశ్‌లోని, గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్‌కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది కేంద్రం. 2021కిగాను ఈ బహుమతికి ఎంపిక చేసింది. గీతా ప్రెస్‌కు ఈ అవార్డు ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో గాంధీ శాంతి బహుమతి ప్రకటన ఈసారి వివాదానికి దారితీసింది. ఇంతకీ ఈ బహుమతిని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని అందిస్తుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన గీతాప్రెస్‌ను 2021 గాంధీ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ఈ బహుమతి కింద ఒక జ్ఞాపిక, రూ.కోటి నగదు అందిస్తారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కమిటీ గీతాప్రెస్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కారణం.. ఈ ప్రెస్ హిందూ మత గ్రంథాలను ప్రచురించడమే. హిందూ మత గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రచురించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటింగ్ సంస్థ ఇది. వందేళ్ల నుంచి ఈ సంస్థ పని చేస్తోంది. 1923లో జయ దయాళ్ గోయంకా, ఘనశ్యామ్ దాస్ జలాన్‌లు గీతా ప్రెస్‌ను స్థాపించారు. అప్పటినుంచి సనాతన ధర్మ సూత్రాల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందూ ధర్మ ప్రచారానికి అనువైన అనేక గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. ఇప్పటివరకు 93 కోట్లకుపైగా పుస్తకాలను ముద్రించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ హిందీ, తెలుగుతోపాటు అనేక భాషల్లో పుస్తకాలను ముద్రిస్తుంది. భగవద్గీత ముద్రణలో గీతా ప్రెస్ ముందుంటుంది.
కాంగ్రెస్ అభ్యంతరం.. బీజేపీ ఎదురుదాడి
ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి అవార్డు ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూ గ్రంథాలను ముద్రించే సంస్థకు శాంతి బహుమతి ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ అంటోంది. ఈ సంస్థకు, మహాత్మా గాంధీకి అప్పట్లో విబేధాలుండేవని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ గుర్తు చేశారు. గాంధీ విబేధించిన సంస్థకు ఆయన పేరుతోనే అవార్డు ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడమంటే హిందూత్వవాది అయిన సావర్కర్‌కు, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు కూడా అవార్డు ఇవ్వడమే అంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇంతకుమించి పరిహాసం ఉండదని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ విమర్శల్ని బీజేపీ తిప్పికొడుతోంది. కేంద్ర మంత్రులు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించిన వారి నుంచి, ట్రిపుల్ తలాక్‌పై నిషేధాన్ని వ్యతిరేకించిన వారి నుంచి ఇంతకుమించి ఏం ఆశిస్తామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. ముస్లింలీగ్‌ను సెక్యులర్ సంస్థగా పరిగణించే కాంగ్రెస్ నేతలకు తప్ప, గీతాప్రెస్‌కు అవార్డు ఇవ్వడంలో ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. దీంతో గాంధీ శాంతి బహుమతి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు గీతాప్రెస్‌కు అవార్డు రావడంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా హర్షం వ్యక్తం చేశారు.
రూ.కోటి వద్దన్న గీతాప్రెస్
మహాత్మా గాంధీ శాంతి బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేసిన గీతా ప్రెస్ రూ.కోటి నగదు బహుమతి తీసుకోవడానికి మాత్రం నిరాకరించింది. అవార్డును మాత్రమే స్వీకరిస్తామని చెప్పింది. ఎలాంటి విరాళాలు తీసుకోకూడదని తమ సంస్థ సంప్రదాయమని, దీనికి అనుగుణంగా కోటి రూపాయలు తీసుకోకూడదని నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ నగదును ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలని సూచించారు. తమ సంస్థను అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, తమ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే అని, అయితే, ఈ సంస్థను మూసివేస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాము ఎప్పుడూ లాభాపేక్ష లేకుండా పనిచేశామని చెప్పింది. తమకు అవార్డు రావడంపై జరుగుతున్న రాజకీయ రగడపై స్పందించేందుకు సంస్థ ట్రస్టీ దేవీ దయాళ్ నిరాకరించారు. రాజకీయాల గురించి తాము మాట్లాడబోమన్నారు.
గతంలో అవార్డు పొందింది వీళ్లే
సమాజంలో శాంతి స్థాపన, మార్పు కోసం ప్రయత్నించే వ్యక్తులు, సంస్థలకు గాంధీ శాంతి బహుమతి అందిస్తారు. దీన్ని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో ఏర్పాటు చేశారు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, షేక్ ముజీబ్, టాంజానియా మాజీ అధ్యక్షుడు జూలియస్ నెరెరేతోపాటు బంగ్లాదేశ్‌లోని గ్రామీణ బ్యాంకుకు ఈ అవార్డు దక్కింది.