GANTA VS BOTSA: నిను వీడని నీడను నేనే.. గంటాను వదలని బొత్సా.. భీమిలీకి షిప్ట్ తో పరేషాన్

నిను వీడని నీడను నేనే అంటూ బొత్సాయే భీమిలీకి షిప్ట్ అవుతున్నారట. దాంతో ఇలా జరిగిందేటబ్బా అని గంటా తలపట్టుకుంటున్నారు. బొత్స ఈసారి భీమిలీకి షిప్ట్ అవ్వడానికి ముఖ్య కారణం. ఆయన భార్య బొత్సా ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండటమే.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 01:40 PM IST

GANTA VS BOTSA: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి.. ప్రస్తుత మంత్రి బొత్సా సత్యనారాయణ భయం పట్టుకుంది. బొత్స ప్రస్తుతం చీపురుపల్లి వైసీపీ ఎమ్మెల్యే. ఆయనకు పోటీగా తెలుగుదేశం అభ్యర్థి స్ట్రాంగ్‌గా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే చీపురుపల్లిలో పోటీ చెయ్యమని గంటాకు సలహా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం.. చీపురుపల్లి వెళ్ళడానికి ఒప్పుకోవడంలేదు. భీమిలీ నుంచే పోటీకి దిగుతానని మొండికేశారు. అక్కడ బొత్స మీద గెలవడం కష్టమని గంటా భయపడ్డారు. తనను బలిపశువును చేస్తారా అంటూ టీడీపీ హైకమాండ్‌ను ప్రశ్నించారు కూడా.

BJP SUSPENSE : ఎందుకీ సస్పెన్స్? ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. నిను వీడని నీడను నేనే అంటూ బొత్సాయే భీమిలీకి షిప్ట్ అవుతున్నారట. దాంతో ఇలా జరిగిందేటబ్బా అని గంటా తలపట్టుకుంటున్నారు. బొత్స ఈసారి భీమిలీకి షిప్ట్ అవ్వడానికి ముఖ్య కారణం. ఆయన భార్య బొత్సా ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండటమే. భీమిలీ కూడా అదే లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది. అందువల్ల.. ఇద్దరి ప్రచారానికి పనికొస్తుంది. ఆ లోక్ సభ సీటు పరిధిలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలపైనా శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఝాన్సీకి టిక్కెట్ ఇస్తామని వైసీపీ చెప్పిన తర్వాత.. తనకు కూడా అదే నియోజకవర్గ పరిధిలో టిక్కెట్ ఇవ్వాలని షరతు పెట్టారట బొత్స. అందుకు జగన్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. భీమిలీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ రాజులు గానీ, కాపులు గానీ పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు. అందుకే భీమిలీ నుంచే పోటీకి బొత్స ఇంట్రెస్ట్‌గా ఉన్నారని సమాచారం.

బొత్స భీమిలీకి వస్తే.. గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఈ సీటును జనసేన అడిగినా త్యాగం చేయడానికి గంటా ఒప్పుకోలేదు. చీపురుపల్లికి వెళ్ళమన్నా సరే.. లేదు నేను ఇక్కడే పోటీ చేస్తానని భీష్మించుకున్నారు. ఇప్పుడు బొత్సయే భీమిలీకి వస్తుండటంతో చంద్రబాబు కూడా గంటా ప్రతిపాదనకు ఓకే చెప్పే ఛాన్సుంది. ఎటు తిరిగీ.. ఈసారి బొత్స మీదే పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకి రాసి పెట్టి ఉందేమో.