Ganta Srinivasa Rao: బొత్సకి గంటాని బలి ఇవ్వబోతున్నారా..? చీపురుపల్లి సాక్షిగా జరిగేది అదే!

చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన ఆయన ప్రతీ ఎన్నికల్లోనూ సీటు మార్చడం అలవాటు. ఇంత కాలం ఈ ఫార్ములాని నమ్ముకుని గెలుపు గుర్రం అనిపించుకున్న గంటాకు ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 05:50 PM IST

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలు కొత్త కాదు. ఆయన ఆలోచనలు, ఎత్తుగడలు ఇందుకు కారణం. 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి MPగా గెలిచిన ఈ కాపు నేత.. 20యేళ్ళుగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నారు. మూడు సార్లు టీడీపీ, ఒకసారి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్ర బాబు కేబినేట్‌లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు గంటా. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన ఆయన ప్రతీ ఎన్నికల్లోనూ సీటు మార్చడం అలవాటు. ఇంత కాలం ఈ ఫార్ములాని నమ్ముకుని గెలుపు గుర్రం అనిపించుకున్న గంటాకు ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి.

YS SHARMILA: అధికారంలోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలిచ్చారు.. జగన్‌కు షర్మిల ప్రశ్న

ఇప్పుడు తన సీటు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోసారి భీమిలి నుంచి పోటీ చేయాలని.. జనసేన, టీడీపీ కలయిక సూపర్ హిట్ అవుతుంది అని అంచనా వేసుకుంటే.. హైకమాండ్ మాత్రం కొత్త ఫిట్టింగ్ పెట్టింది. విద్యా శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణపై పోటీకి గంటానే బలమైన అభ్యర్థిగా భావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాగూ ఎన్నికలకు ఒకసారి సీటు మార్చే అలవాటు ఉన్న గంటాను ఈసారి చీపురుపల్లి పంపాలని భావిస్తున్నట్టు రాబిన్ శర్మ ద్వారా సందేశం పంపినట్టు సమాచారం. ఇక్కడ గంటా అనుచర వర్గం అనుమానం నిజమైంది. గంటా ఎప్పుడు విశాఖ జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. పైగా ఆయన అర్బన్ పొలిటీషియన్. పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్‌ను నమ్ముకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ దూకుడుకు వైసీపీ బ్రేకులు వేసింది. ఉత్తర నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బలం ఉండి కూడా గంటా అత్తెసరు మెజారిటీతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. అలాంటిది మాస్ ఇమేజ్ ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే బొత్స లాంటి సీనియర్ల మీద పోటీకి పంపడం అంటే దీని వెనుక ఎత్తుగడలు వేరే ఉన్నయనేది అనేది గంటా వర్గీయులు అనుమానం.

ALLA RAMAKRISHNA REDDY: షర్మిలపై ఆళ్ల కోవర్టు ఆపరేషన్‌.. వెళ్లి.. వెనక్కి వచ్చింది అందుకేనా?

ఈ ప్రచారాలపై గంటా సైతం అసహనంగా ఉన్నారు. చీపురుపల్లిలో తాను గెలిచే అవకాశం లేదని గంటాకు స్పష్టంగా తెలుసు. అందుకే అక్కడి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలకు తేల్చిచెప్పినట్టు సమాచారం. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. గంటా మాటను ఖాతరు చేయకుండా హైకమాండ్ లీకులు ఇవ్వడంతో సందిగ్ధంలో పడ్డారు. అంతేకాకుండా గంటా కోరుతున్న భీమిలి సీటును జనసేన కేటాయిస్తున్నట్టు కూడా టీడీపీ సమాచారం బయటకు వదిలింది. దాంతో నేరుగా చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు గంటా సిద్ధమవుతున్నట్టు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. చీపురు పల్లి కాపు నియోజకవర్గం అనే ముద్ర ఉన్నా.. అది గంటాకు కలిసి రాదనేది రాజకీయ విశ్లేషణ. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి కాకుండా తన సామాజికవర్గం అధికంగా ఉండే నెల్లిమర్లలో పోటీ చేయాలని గంటా మొదట భావించారు. అయితే, అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. ఆ తర్వాత చోడవరం నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయసేకరణ చేశారు.

అయితే, గతంలో గెలిచి అక్కడ తన గెలుపునకు కృషిచేసిన వారిని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో పాటు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. దీంతో చివరకు భీమిలి నుంచి బరిలో దిగేందుకు గంటా నిర్ణయించుకున్నారు. ఓవైపు గంటా తన ప్రయత్నాలు చేసుకుంటుంటే.. హైకమాండ్ చీపురుపల్లి ప్రయోగం వెనుక అసలు ఉద్దేశాలు గంటాకు అర్థం అయ్యాయట. అందుకే 150కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి వెళ్ళబోనని గంటా చెప్పకనే చెప్పేశారు.