గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజూ బంగారం ధర తగ్గింది. రెండ్రోజుల్లో తులంపై ఏకంగా2వేల వరకూ డౌన్ అయ్యింది. మరి గోల్డ్ ఇంకా పడిపోతుందా…? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది…? అసలు బంగారం ధర ఎందుకు పడిపోతోంది…?
బంగారం… బంగారం.. ప్రస్తుతం మహిళల కలల్లోకి కూడా బంగారమే వస్తోంది. రోజు రోజుకు రేటు తగ్గుతూ ఊరిస్తూ కవ్విస్తోంది. రా రా రమ్మంటూ రెచ్చగొడుతోంది. ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి బంగారానికి భయం పట్టుకుంది, రోజు రోజుకు రేటు పడిపోతూ దానిపై బెంగపెట్టుకున్న మహిళలకు చేరువవుతోంది. రెండ్రోజులు పెరిగితే నాలుగు రోజులు పడిపోతోంది. హైదరాబాద్ లో తాజాగా మళ్లీ బంగారం రేటు పడిపోయింది. రెండ్రోజుల్లో 10గ్రాముల పసిడిపై రెండున్నర వేల వరకూ పడిపోయింది. ఇక వెండి అయితే ఈ రెండ్రోజుల్లోనే ఏకంగా 3వేలు దిగొచ్చింది.
హైదరాబాద్ లో నవంబర్ 24న 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 79వేల 840 రూపాయలుగా ఉంది. అదిప్పుడు 77వేల 240కి చేరింది. అంటే రెండ్రోజుల్లో 2వేల 6వందల రూపాయలు పడిపోయిందన్న మాట. ఒక్క రోజులోనే 15వందల వరకూ తగ్గింది. అలాగే 22క్యారెట్ల పసిడి కూడా రెండ్రోజుల క్రితం 73వేలుగా ఉంటే అదిప్పుడు 70వేల 8వందలుగా ఉంది. అంటే 2వేల 2వందలు దిగొచ్చింది. ట్రంప్ గెలుపు తర్వాత పసిడి మిడిసిపాటు బాగా తగ్గింది. ఆ మధ్య 22క్యారెట్ల పసిడి 69వేలకు చేరి మళ్లీ కొంచెం పెరిగింది. అయ్యో మళ్లీ పెరుగుతుందే అని బెంగపడేలోపే దిగొచ్చింది. అయితే అప్పుడే ఏం కాలేదు పసిడి జాతకం అంత బాగోలేదు. శని వక్ర దృష్టితో చూస్తున్నట్లున్నాడు. రానున్న రోజుల్లో అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి.
షార్ట్ టర్మ్ లో పాపం పసిడికి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. రేటు పెరిగే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు సరికదా పడిపోయే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్రంప్ ప్రస్తుతం టారిఫ్ వార్ కు తెర తీశారు. అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచే మెక్సికో, కెనడాపై 25శాతం పన్నులు వేస్తామన్నారు. ఇక చైనా గూడ్స్‌పై అదనంగా మరో 10శాతం పన్ను పెంచబోతున్నట్లు ప్రకటించేశారు. దీనికి కౌంటర్ ఉంటుందని చైనా కూడా వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ బెట్ బంగారం వైపు చూడాలి. దీంతో పసిడి పరుగు మొదలుపెట్టాలి. కానీ అమెరికా డాలర్ పుంజుకోవడంతో మెజారిటీ ఇన్వెస్టర్లు దానివైపే చూస్తున్నారు. అలాగే బాండ్ రాబడులు ఆశాజనకంగా ఉండటం కూడా గోల్డ్ స్పీడ్ కు బ్రేకులు వేస్తోంది. ఇదే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా పసిడి ధరలకు కళ్లెం వేస్తున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ అమల్లోకి రాబోతోంది. అదే జరిగితే యుద్ధమేఘాలు తొలగిపోతాయి. దీంతో బంగారం నుంచి మరిన్ని పెట్టుబడులు ఎక్కువ రాబడినిచ్చే డాలర్ వైపు తరలిపోతాయి. ఇది ధర తగ్గడానికి మరింత కారణం అవుతుంది. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. దీనికి తోడు ఇప్పటికే బంగారానికి బిట్ కాయిన్ తొడగొట్టి సవాల్ విసిరింది. ఇవన్నీ బంగారం ధర తగ్గుదలకు కారణం అవుతున్నాయి.
బంగారం ఇంకా ఎంతవరకు పడిపోతుందన్నది చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎవరివైనా ఊహాగానాలే తప్ప స్పష్టంగా చెప్పలేరు. అయితే అంతర్జాతీయ పరిశీలకుల అంచనాల ప్రకారానికి 24క్యారెట్ల పసిడి మరో 5-10శాతం కరెక్షన్ కు అవకాశం ఉంది. అంటే 72వేల వరకూ రావొచ్చన్నమాట. అంతకుమించి పడిపోయే అవకాశాలు లేనట్లే. ఒకవేళ కీలకమైన సపోర్టింగ్ లెవల్ 72 కిందకు దిగితే అది 70వేల వరకు వచ్చి మళ్లీ పుంజుకుంటుంది. కాబట్టి బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. రష్యా లాంటి దేశం ఏదైనా దూకుడు చర్యలు తీసుకుంటే వెంటనే మళ్లీ బంగారానికి క్రేజ్ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుందనో పెరుగుతుందనో స్పష్టంగా చెప్పలేరు. అయితే స్వల్పకాలంలో మాత్రం కొంతమేర కరెక్షన్ ఉంటుందన్నది నిపుణుల అంచనా. అయితే దీర్ఘకాలంలో మాత్రం బంగారానికి ఏ మాత్రం డోకా ఉండకపోవచ్చు. కాబట్టి గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం ఇదే సరైన టైమ్. ఇక సిల్వర్ విషయానికి వస్తే దానికి పెద్ద ఢోకా లేదు. ఇండస్ట్రియల్ డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రేటు తగ్గినా మళ్లీ పుంజుకుంటుంది.