Gorantla Butchaiah Chowdary: ఎన్టీఆరే కారణమా..? ఎన్టీఆర్‌ మీద కోపంతోనే గోరంట్లపై వేటు వేశారా?

జగన్‌ వేవ్‌ జోరుగా కనిపించిన ఎన్నికల్లో 10వేలకు పైగా ఓట్ల మెజారిటీ రావడం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి స్థానం ఇప్పుడు టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన కర్చీఫ్ వేసింది.

  • Written By:
  • Updated On - February 21, 2024 / 04:04 PM IST

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్.. టీడీపీకి కంచుకోట. నియోజకవర్గంగా ఆవిర్భవించిన తర్వాత.. సైకిల్ పార్టీ ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగితే.. అన్నింట్లోనూ పసుపు జెండానే ఎగిరింది. 2009లో చందన రమేష్.. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ టీడీపీ గెలిచిన స్థానాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి. జగన్‌ వేవ్‌ జోరుగా కనిపించిన ఎన్నికల్లో 10వేలకు పైగా ఓట్ల మెజారిటీ రావడం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి స్థానం ఇప్పుడు టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన కర్చీఫ్ వేసింది.

BJP DEMANDS TDP: చంద్రబాబు పాట్లు.. ఇస్తావా.. చస్తావా! బాబుకు బీజేపీ హుకుం

జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్.. ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది. మరి ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చయ్యకు సీటును ఎలా సర్దుబాటు చేస్తారు..? అదీ లేకపోతే ఆయనను ఎలా బుజ్జగిస్తారనేది ఉత్కంఠతగా మారింది. జనసేన అభ్యర్థి విజయానికి గోరంట్ల సహకరిస్తారా లేదా అన్నది మరో పెద్ద ప్రశ్న. జనసేన ముందు నుంచి పట్టుబడుతున్న స్థానాల్లో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి. ఐతే తమ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానాన్ని టీడీపీ.. అంత ఈజీగా ఎలా వదులుకుంది అనే అంశంపై సోషల్‌ మీడియాలో కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద కక్షతోనే పార్టీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుండా చంద్రబాబు ప్లాన్‌ వేసినట్లు ఉన్నారంటూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ పుంజుకునే అవకాశాలు లేవు అంటూ ఓ సమయంలో గోరంట్ల వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎన్టీఆర్‌ను ఆహ్వానించాలని కూడా చంద్రబాబుకు సూచించారు.

ఇది మనసులో పెట్టుకొనే కంచుకోట అని తెలిసినా.. రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారా అనే ప్రచారం నడుస్తోంది. ఇక అటు లోకేశ్‌కు, బుచ్చయ్య చౌదరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. దీంతో ఇద్దరు కలిసి గోరంట్లకు టికెట్ రాకుండా పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ ఇచ్చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. మరి అసలు కారణం ఏంటి.. రూరల్ స్థానాన్ని జనసేనకు ఇస్తే.. గోరంట్లకు మరే పదవైనా ఇస్తారా.. తర్వాత సంగతి తర్వాత అంటారా అనే చర్చ కూడా జరుగుతోంది.