Govt Employees: తెలంగాణ, ఏపీల్లో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అటు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు సాధించుకోవడానికి ఇదే మంచి సమయం అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వ సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ లోపే తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. పైగా ఇప్పుడైతేనే కేసీఆర్ తమకు సానుకూలంగా స్పందిస్తారని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ఏర్పాటు, ఈహెచ్‌సీ అమలు, సీపీఎస్ రద్దు, పాత బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లు నెరవేర్చుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించే అవకాశం ఉంది. ఉద్యోగులను ఆకట్టుకునే అంశంపై ఇప్పటికే ఫోకస్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. త్వరలో పీఆర్సీ ఏర్పాటు అంటూ మీడియాకు లీకులిస్తూ ప్రచారం చేసుకుంటోంది. దీని ప్రకారం.. పీఆర్సీ ఏర్పాటు దాదాపు ఖాయం. అలాగే పాత బకాయిల చెల్లింపు వంటివి కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది. అయితే, సీపీఎస్ రద్దు విషయంలోనే సమస్య ఎదురవుతోంది. ఈ విషయంలోనే పీటముడి పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ వైద్యులు కూడా తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాటపట్టబోతున్నారు. ప్రమోషన్లు, వేతన బకాయిల విడుదల వంటి డిమాండ్లు నెరవేర్చాలని వైద్యులు కోరుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు సిబ్బంది కూడా తమను పర్మినెంట్ చేయాలి అని, వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు. ఏ డిమాండ్లనైనా ఎన్నికల్లోపే నెరవేర్చుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమాలకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలోనూ ఎన్నికలొస్తాయి. ఈలోగానే తమ డిమాండ్లు సాధించాలని ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. సీఎం జగన్ తాను ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి, తర్వాత తప్పారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ (గ్యారెంటీ పెన్షన్ స్కీమ్) అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దీనిపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్ వద్దు.. జీపీఎస్ వద్దు.. తమకు ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో ఈ విషయంపై పలుసార్లు ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అందుకే ఈసారి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులు తాజాగా సమావేశమై, జీపీఎస్ అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే వై నాట్ ఓపీఎస్ పేరుతో మరోసారి ఛలో విజయవాడ కార్యక్రమం ద్వారా భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సీపీఎస్ సంఘాలు ప్రకటించాయి. మిగతా ఉద్యోగ సంఘాలు కూడా తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తప్పేలా లేదు. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వాలు వారి డిమాండ్లకు తలొగ్గాల్సిందే. అయితే, సీపీఎస్ అమలు ఆర్థికంగా భారం కావడంతో రెండు ప్రభుత్వాలు ఈ విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. చాలా వరకు ప్రభుత్వాలు ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది.