ఎందుకింత పగ? స్టూడెంట్స్ సార్ దేశద్రోహులు కాదు!

సార్ ప్లీజ్.. దయచేసి నన్ను లోపలికి వెళ్లనివ్వండి. ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయితే నా ఆశయం నెరవేరుతుంది. ప్లీజ్ సార్ బస్‌ లేట్‌గా వచ్చింది. అందుకే ఆలశ్యం అయింది. లోపలికి వెళ్లనివ్వండి... గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్ధి ఆవేదన.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 11:14 AM IST

సార్ ప్లీజ్.. దయచేసి నన్ను లోపలికి వెళ్లనివ్వండి. ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయితే నా ఆశయం నెరవేరుతుంది. ప్లీజ్ సార్ బస్‌ లేట్‌గా వచ్చింది. అందుకే ఆలశ్యం అయింది. లోపలికి వెళ్లనివ్వండి… గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్ధి ఆవేదన. అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా… ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కళల్లో ఒత్తులేసుకుని మరీ వెయిట్ చేసాను. సమయం తక్కువగా ఉన్నా కొండంత సిలబస్‌ను తిండి నిద్ర మానేసి మరీ చదివాను. ప్లీజ్ సార్ మీ బిడ్డలాంటి దాన్ని దయచేసి గేట్ తీయండి. ఈ పరీక్ష రాసి పాస్ అయితే… మా నిరుపేద బతుకులు బాగు పడతాయి..ఇదీ మరో ఎగ్జామ్ సెంటర్ వద్ద మహిళా అభ్యర్ధిని కన్నీటి కుండపోత. కొన్నాళ్లుగా టెన్త్ విద్యార్ధుల నుంచి గ్రూప్స్ ఎగ్జామ్ అభ్యర్ధుల వరకు నరకం చూపిస్తోంది ఈ నిమిషం నిబంధన. కొన్ని సార్లు మరణశిక్ష గా మారుతోంది. మారింది కూడా.

2024…ఫిబ్రవరి 29 న…ఆదిలాబాద్ జిల్లా మాంగూర్ గ్రామానికి చెందిన టేకం శివకుమార్‌ అనే విద్యార్ధి… సత్నాల ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలుసా… ఒక నిముషం లేట్‌గా వచ్చాడనే సాకుతో అధికారులు శివకుమార్‌ను ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనివ్వలేదు. తన కన్నీళ్లతో ఇన్విజిలేటర్ల కాళ్లు కడిగాడు. సార్… మా అమ్మ, అయ్య కూలోళ్లు.కాయ కష్టం చేసి నన్ను చదివిస్తున్నరు. నేను వచ్చే ఆటో పంక్చర్ అయింది. అందుకే లేట్ అయింది. పరీక్ష రాయనివ్వండి సార్ అంటూ అడుక్కున్నాడు. అయినా సరే ఎవరి మనసు కరగలేదు. అంతే… సూసైడ్ నోట్ రాసి ఉసురుతీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి. శివకుమార్ మరణానికి కారకులు ఎవరు? శివకుమార్ చనిపోలేదు. చంపేసారు. అవును ఈ ప్రభుత్వమే ఆ విద్యార్ది జీవితానికి నిమిషం నిబంధనతో విషం పెట్టింది. శివకుమార్ మాత్రమే కాదు రాచకొండ గుట్టల్లా ఉండే సిలబస్‌ను ఏడాదంతా మదించి వదించి పరీక్షలకు సిద్ధమవుతారు విద్యార్ధిని విద్యార్ధులు. రోడ్డెక్కి గొంతు చించుకుంటేనో, లాఠీ దెబ్బలు భరిస్తేనో… ఉద్యోగాల నోటిఫికేషన్లు రానీ ఈ దుర్మార్గపు రోజుల్లో..తిండి నిద్ర మానేసి మరీ పోటీ పరీక్షలకు యోధుల్లా వస్తారు అభ్యర్ధులు. జీవితాలను పణంగా పెట్టి పరీక్షలు రాసేందుకు వస్తే… ఒక్క నిముషం ఒకే ఒక్క నిముషం లేట్ అయిందనే సాకుతో వారిని పరీక్షా కేంద్రాల్లోకి రానివ్వకపోవటం ఎంతటి అమానవీయం… ఎంతటి రాక్షసత్వం.

అయినా అసలు ఎందుకు ఈ నిమిషం నిబంధన? ఇంతకు ముందు లేనిది కొన్నాళ్ల నుంచే ఎందుకు అంటే… మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా.. అసలు తావు ఇవ్వకుండా అనేది ప్రభుత్వవాదన. మాల్ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది అంటే… ఎగ్జామ్‌ హాల్ నుంచి పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్విజిలేటర్స్‌ లీకు వీరులుగా మారతారు. మొబైల్స్ ద్వారా క్వశ్చన్స్‌ను చేరవేస్తారు. అందుకే నో ఎంట్రీ ఫర్‌ వన్ మినిట్ లేట్ కమర్స్‌ అనేది గవర్నమెంట్ల వాదన. సర్కార్ వారు చెప్తున్న ఈ స్టేట్‌మెంట్ ను పరిశీలిస్తే… ఇందులో ప్రభుత్వ చేతకానితనం క్లియర్‌ కట్ గా కన్పిస్తోంది. మాల్ ప్రాక్టీస్ కచ్చితంగా జరుగుతుంది అందుకే ఈ నిముషం నిబంధన అంటే… మాకు చేతకావట్లేదు అని ప్రభుత్వాలు ఒప్పుకున్నట్లే కదా? అక్రమాలను మేము అరికట్టలేకపోతున్నామని కాడి వదిలేసినట్లే కదా? సరే… ప్రభుత్వాలది ఏమి తప్పులేదు. అంతా స్టూడెంట్స్‌ దే అనుకుందాం…. సరే విద్యార్ధిలోకం తరపున..ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రభుత్వాలకు ఉందో లేదో తేల్చుకుందాం? క్వశ్చన్ నెంబర్ 01… ఒక నిమిషం లేట్ అయినా సరే ఆరోజు జీతాన్ని కట్ చేస్తామనే నియమ నిబంధనను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసే సత్తా ఏ ముఖ్యమంత్రికి ఉంది?

క్వశ్చన్ నెంబర్ 02… 8గంటలు సరిగ్గా ఆఫీసులో ఉండి పని చేయకుంటే… ప్రజలకు సేవ చేయకుంటే, సెలవు పెట్టకుండా ఆఫీస్‌ ఎగ్గొడితే… హోదా చూడకుండా కలెక్టర్‌ నుంచి క్లర్క్‌ వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి మీద అయినా యాక్షన్ తీసుకునే దమ్ము ఏ ప్రభుత్వానికి ఉంది?

క్వశ్చన్ నెంబర్ 03… అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలు, వచ్చినా సభలో టైమ్ పాస్ చేసే ప్రజా ప్రతినిధుల మీద యాక్షన్ తీసుకునే తెగింపు ఏ ముఖ్యమంత్రికి ఉంది? ఈ మూడు ప్రశ్నలే కాదు ప్రభుత్వాలను అడగాల్సినవి, పాలకులను కడగాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి…ఉంటాయి. అడిగే దమ్ము, ధైర్యం మాకు ఉంది. కానీ నిలదీస్తే బదులిచ్చే ధైర్యం ఏ ప్రభుత్వాలకు అయినా ఉందా లేదా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయినా ఎగ్జామ్స్‌ రాసే స్టూడెంట్స్‌ కు అంతకు మించి పని ఏమి ఉంటుంది? ఏ ఒక అరగంట ముందు ఎగ్జామ్‌ సెంటర్‌కు వస్తే తప్పేంటి? డిసిప్లిన్‌ ఉండాల్సిందే అనేది కొందరి పిడివాదన. నిజమే, సమయం విలువైనదే. మరి ఈ జ్ఞానం కేవలం స్టూడెంట్స్‌ ఎగ్జామ్స్‌ టైంలోనే గుర్తుకొస్తే ఎలా? ప్రభుత్వాలను, పాలకులను కాలర్ పట్టుకుని నిలదీయటంలో ఈ జ్ఞానం ఎక్కడ ముసుగేసుకుని పడుకుంటుందో వాళ్లే చెప్పాలి మరి.

టూ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆలకించాల్సింది..ఆలోచించాల్సింది ఒక్కటే… సమయపాలన నేర్పించడం అవసరమే. కానీ దాన్ని పరీక్షలకు ముడి పెడితే ఎలా? ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు… ఒక ఏడాది విద్యా సంవత్సరం కోల్పోవడం అనేది ఎంత నరకమో, ఎంతటి శాపమో ఇప్పటికైనా ఆలోచించండి.. నిమిషం నిబంధన కారణంగా ఉసురు తీసుకున్న ఆదిలాబాద్ ఇంటర్ విద్యార్ధి శివకుమార్‌ లా మరెందరో ఉరితాళ్లకు వేలాడకుండా ఉండాలంటే.. ఏ ప్రాజెక్టులోనో శవాలుగా తేలకుండా ఉండాలంటే…. విద్యార్ధుల తరపున ఒక్కటంటే ఒక్క నిమిషం ఆలోచించండి.