TTD Chairman: టీటీడీ కొత్త ఛైర్మన్ ఎవరు..? బీసీలకే జగన్ ఈసారి అవకాశం ఇస్తారా..? వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రతిపాదన ఏంటి..? రాజకీయాలను కూడా ఇందులో మిక్స్ చేసి పవన్‌ను దెబ్బకొట్టాలన్న ఆ ప్రతిపాదనకు సీఎం మొగ్గు చూపుతారా..?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వరుడు. ఆ స్వామి సేవలో నిత్యం తరించే భాగ్యం కొంతమందికే దక్కుతుంది. అందుకే టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవికి విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పదవి దక్కడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పుకుంటారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు7తో ముగుస్తుంది. దీంతో కొత్త ఛైర్మన్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. ఈ అంశంపై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరగా పవన్ కల్యాణ్‌ను భీమవరంలో ఓడించిన గ్రంధి శ్రీనివాస్ దగ్గరకు వచ్చి ఆగింది. ప్రస్తుతానికి అది ఫైనల్ కానప్పటికీ ఆ పేరు కూడా ఇప్పుడు తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది. దీంతో పవన్‌ను రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉండటంతో జగన్ కూడా సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ వర్గానికే ఈసారి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారని సమాచారం. రెండుసార్లు రెడ్డి వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈసారి బీసీలకు ఇస్తే రేపటి ఎన్నికల్లో అది కలసి వస్తుందని ఆయన భావించారు. దీంతో బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన పేరు ప్రకటించడం లాంఛనమే అన్న ప్రచారం సాగింది. ఒకవేళ ఆయనకు కాకపోతే అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పార్థసారథి పేరు కూడా పరిశీలించొచ్చని వైసీపీ వర్గాలు భావించాయి. అయితే మధ్యలో భూమన రేసులోకి వచ్చారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని, తన కుమారుడ్ని బరిలోకి దించుతానని చెప్పారు. గతంలో బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దీంతో జగన్ దీనిపై పునరాలోచన చేసి బీసీ వర్గానికే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇంతలో వైవీ సుబ్బారెడ్డి మరో ఆసక్తికర ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతకు అవకాశం ఇస్తే అది రాజకీయంగా తమకు కూడా కలసి వస్తుంది అన్న ప్రతిపాదనను సీఎం ముందుంచారు. గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ. పవన్‌కు కాపు యువత సపోర్ట్‌గా నిలుస్తోంది. ఈ సమయంలో కాపు నేతకు అవకాశం ఇస్తే వారిని కొంతమేరైనా తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందన్నది వైసీపీ పెద్దల ఆలోచన. దీంతో జగన్ మరోసారి కన్ఫ్యూజన్‌లో పడ్డారంటున్నారు. టీటీడీ అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని ఇటీవల కాపు నేత హరిరామజోగయ్య కోరారు. ఇప్పుడు కాపు నేతకు అవకాశం ఇస్తే ఆ క్రెడిట్ జనసేనకు ఏమైనా వెళుతుందా అన్న భయం కూడా వైసీపీ పెద్దలకు ఉంది. మరోవైపు భూమన మాత్రం గట్టిగా లాబీయింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ బీసీలకు అవకాశం ఇస్తారా..? కాపులకు ఓటేస్తారా..? రెడ్డికే జై కొడతారా..? త్వరలోనే తేలనుంది.