GVL Narasimha Rao: హడావిడి మాస్టర్.. GVL ఎక్కడ..?

ఢిల్లీ, గుజరాత్‌లో ఎన్నికల సర్వేలు చేసి.. బీజేపీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన జీవీఎల్ నర్సింహారావును ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఈసారి ఏపీలోని విశాఖపట్నం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నిలబడాలని ఆశపడ్డారు.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 02:13 PM IST

GVL Narasimha Rao: అంతన్నాడు.. ఇంతన్నాడు.. విశాఖకు తానే ఎంపీ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇలా రెండేళ్ళుగా తెగ హడావిడి చేశారు బీజేపీ లీడర్ GVL నర్సింహారావు. తీరా లోక్‌సభ ఎన్నికల సందడి మొదలయ్యాక.. ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఇన్నాళ్ళు జనంలో తిరిగిన జీవీఎల్.. ఒక్కసారిగా ఎందుకు మాయమయ్యారు. విశాఖ ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదా..? ఆ ఏరియాలో తిరగవద్దని ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పేశారా.

TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా విడుదల.. 34 మందికి టిక్కెట్లు

ఢిల్లీ, గుజరాత్‌లో ఎన్నికల సర్వేలు చేసి.. బీజేపీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన జీవీఎల్ నర్సింహారావును ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఈసారి ఏపీలోని విశాఖపట్నం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నిలబడాలని ఆశపడ్డారు. అందుకే గత రెండేళ్ళుగా వైజాగ్‌లో GVL చేయని కార్యక్రమం అంటూ లేదు. సంక్రాంతి సంబరాలు, రిపబ్లిక్ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు చెందిన CSR నిధులతో సంగీతం, డ్యాన్సులు లాంటి ఈవెంట్స్ నిర్వహించడం అప్పట్లో వివాదస్పదమైంది. సేవ కార్యక్రమాలు, పేదల కోసం ఖర్చు చేయాల్సిన CSR నిధులను ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి ఖర్చుపెట్టడం ఏంటని కమ్యూనిస్ట్ పార్టీలు జీవీఎల్ మీద మండిపడ్డాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు లోక్‌సభ సీట్లు దక్కాయి. వాటిల్లో ఎక్కడా కూడా జీవీఎల్ పేరు వినిపించడం లేదు. పైగా విశాఖ నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని.. సీఎం రమేష్ బీజేపీ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ జీవీఎల్ నర్సింహారావు అలాంటి ప్రతిపాదన చేశారో లేదో కూడా తెలియట్లేదు.

విశాఖలో ఇన్నేళ్ళు GVL హడావిడి చేసినా.. కేంద్ర ప్రభుత్వం తరపున ఏ సమస్య కూడా పరిష్కరించిన దాఖలాలు లేవంటున్నారు. ఎవరు ఏ సమస్య చెప్పినా.. లెటర్లు రాయడమే తప్ప పరిష్కారం లేదని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ భూమి బదిలీపైనా కల్పించుకోలేదు. విశాఖ ఉక్కు మీద ఏపీ అంతా ఉద్యమం జరుగుతున్నా జీవీఎల్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. జీవీఎల్‌కు వైజాగ్‌లో స్థానిక బీజేపీ నాయకుల నుంచి కూడా ఆశించిన మద్దతు రాలేదని తెలుస్తోంది. అటు అధిష్టానం కూడా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోనట్టు సమాచారం. అందుకే వైజాగ్‌లో జీవీఎల్ హడావిడి మాస్టర్‌గా మిగిలారే తప్ప.. లోక్‌సభ రేసులో మాత్రం లేకుండా పోయారు.