నిన్న RBI ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయన్నారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని తేలిపోయిందన్నారు హరీష్.
పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందని తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్టమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్టం అని ప్రచారం చేసిందని మండిపడ్డారు. సీఎం లేని దివాలాని ప్రచారం చేసి మాపై బురద జల్లేందుకు ప్రయత్నించి ఆయనే బురద జల్లుకున్నారన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం కాంగ్రేస్ మంత్రులు పదే పదే గోబెల్స్ చేశారని మండిపడ్డారు.
2014, 15 ఏడాది ముందే 72, 658 కోట్ల అప్పుని తెలంగాణకి గత కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చిందని 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 2024 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు కలిపితే ఒక లక్ష 6 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. పదేళ్ల BRS హయాంలో 3, 22, 499 కోట్ల రూపాయల అప్పు మాత్రమే మేము చేశామని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా RBI వెల్లడించిందన్నారు. ఇప్పటికైనా విషప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలి హితవు పలికారు.