హరీష్ రావు క్రమంగా సీఎం రేస్ నుంచి కనుమరుగు అవుతున్నారా? BRSలో నెంబర్ 3, నెంబర్ 4కి పరిమితమైపోయారా? కొడుకు కోసం కెసీర్ వేసిన మాస్టర్ ప్లాన్ క్రమంగా అమలవుతోంది. రెండో సారి అధికారంలోకి రాగానే కెసీఆర్ తన మాస్టర్ ప్లాన్ అమలు చేశారు.
హరీష్ కి, KTRకి మంత్రి పదవులు ఇవ్వకుండా నెట్టుకొచ్చారు. KTRని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేశారు. ఆ తరవాత మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి పదవులు ఇచ్చారు. తాను అనుకుంటే ఏమైనా చేయగలనని హరీష్ కి పరోక్షంగా చెప్పారు. అలాగే హరీష్ పక్క చూపులు చూడకుండా.. వేరే పార్టీల వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. ఒక రకంగా 1995 ఆగస్ట్ సంక్షోభం లాంటిది తెలంగాణలో జరగకుండా ముందే జాగ్రత్త పడ్డారు. ఆ రోజు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఎలా పార్టీని, సీఎం కుర్చీని లాక్కున్నారో అలా మరోసారి జరగకుండా ముందే జాగ్రత్త పడ్డారు. హరీష్ కూడా ఎక్కడా తొందర పడలేదు. తన అసంతృప్తిని, ఆక్రోశాన్ని బయట పెట్టుకోలేదు. పరిస్థితులను బట్టి తాను వెళ్ళాలి అనుకున్నాడు. అలాగే వెళ్ళాడు. సహజంగానే ఓర్పు, సహనం కాస్త ఎక్కువ కాబట్టి హరీష్ రావు ఎక్కడా కుర్చీ కోసం ఆవేశపడలేదు. బీజేపీతోనో… కాంగ్రెస్ తోనో కుమ్మక్కు అవ్వలేదు. తాను తొందర పడితే అసలుకే మోసం రావచ్చని హరీష్ రావుకి బాగా తెలుసు. ఈ లోపు కెసీఆర్ హరీష్ సన్నిహితుడైన ఈటెల రాజేందర్ ని పార్టీ నుంచి తెలివిగా వెళ్లగొట్టి.. హరీష్ బలం తగ్గించాడు. ఆ డేరింగ్ డెసిషన్ మరోసారి కెసీఆర్ కి మేలు చేసింది. అంతే కాదు హుజురాబాద్ బై ఎలక్షన్స్ బాధ్యత హరీష్ కే అప్పగించి రాజేందర్ ని హరీష్ చేత తిట్టించగలిగారు కెసీఆర్. హుజురాబాద్ ఓటమి భారం కూడా హరీషే భరించాల్సి వచ్చింది.
మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో KTRకి ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు హరీష్ తో పోల్చుకుంటే KTR కి చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. హరీష్ రావు ఉద్యమ కాలం నుంచే జనం లో పాతుకు పోయాడు. ఇప్పటికి జనంలో ఉంటాడు. KTR కి అర్బన్ లీడర్ గానే ముద్ర ఉంది. అహంభావి అని… అందరిని కలవడని.. మాస్ లీడర్ కాదు అనే ప్రచారం ఉండేది. పార్టీ నేతల్లోనూ హరీష్ పైనే ఎక్కువ నమ్మకం కనిపించేది. హరీష్ కి తెలంగాణ 10 జిల్లాల స్థానిక రాజకీయంపై పట్టు ఉంటుంది. అది KTRకి ఉండదని క్యాడర్ లో ఒక భావన ఉండేది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక క్రమంగా అది తగ్గిపోయింది. అటు ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు నుంచి పార్టీ నిర్వహణ వరకు తారక రామారావు పాత్ర చూస్తుండగానే పెరిగిపోయింది. సహజం గానే KTR చుట్టూ కోటరీ బలంగా పెరిగింది. ప్రకటనల్లో ,హోర్డింగుల్లో హరీష్ బొమ్మ కనుమరుగు అవుతోంది. సోషల్ మీడియాలోను KTR కే ప్రాధాన్యం ఎక్కువైంది. ఇండష్ట్రియలిస్టులు… రియల్ ఎస్టేట్ కంపెనీలతో KTRకి సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు KTR డి ఫాక్టో చీఫ్ మినిస్టర్ గానే వ్యవహరిస్తున్నారు.
KTR చుట్టూ పార్టీ లోను బలమైన వర్గం ఏర్పడింది. రంజిత్ రెడ్డి, బాల్కసుమన్, ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, మల్లా రెడ్డి, ఆర్ముర్ జీవన్ రెడ్డి లాంటి లీడర్స్ ఓపెన్ గానే KTR కాబోయే సీఎం అంటూ ఒక ఒపీనియన్ క్రియిట్ చేస్తున్నారు. హరీష్ హవా పలచబడుతోంది. అసెంబ్లీలోను, పార్టీ వేదికలపై KTR వాయిస్ బలంగా వినిపిస్తుంది. జిల్లాలు కూడా విస్తృతంగా తిరగడంతో లోకల్ గా పట్టు పెరిగింది. ఇక భజన సంఘం ఎలాగూ ఉంటుంది కనుక… వాళ్ళు కూడా డప్పు బాగా కొడుతున్నారు. మీడియాలో కూడా ఒక వర్గం KTRని భుజాల కెత్తుకుంది. యూత్ లో అతనిపై క్రేజ్ పెరిగింది. ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడటం, చొరవ KTRకి కలిసొచ్చాయి. క్రమంగా కెసీఆర్ తరవాత KTR అనేది ఫిక్స్ అయిపోయింది. మూడేళ్ళ క్రితం కెసీఆర్ తీసుకున్న నిర్ణయం ఫలితాన్ని ఇచ్చింది. కెసీఆర్ తరవాత నేనే అనుకున్న హరీష్ ఆశ ఆవిరయ్యింది. ప్రస్తుతానికి మౌనం తప్పదు. ఐతే ఫీల్డ్ లో హరీష్ ఇప్పటికి బలమైన నాయకుడు. ఆ అడ్వాంటేజ్ ఎప్పటికి అతనికి ఉంటుంది. కానీ కెసీఆర్ పుత్ర వాత్సల్యం హరీష్ ని ఎదగనివ్వదు. ఏదో అద్భుతాలు జరిగితే తప్ప మరో 20 ఏళ్ల పాటు హరీష్ రావు కి కుర్చీ కోసం ఎదురుచూపులు తప్పవు.