రేవంత్ తెలంగాణ వాడు కాదు, హరీష్ సంచలన కామెంట్స్…!

తెలంగాణాలో బీఆర్ఎస్ నేతలు... సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు... రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Publish Date - November 9, 2024 / 05:27 PM IST

తెలంగాణాలో బీఆర్ఎస్ నేతలు… సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు… రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం చిన్న గణపురంలో తెలంగాణ తల్లి ఆవిష్కరించిన ఆయన… అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర బాబుల సంచులు మోసి ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టినోడు రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగువేల రూపాయలు ఇచ్చి మోసం చేస్తామని హామీ ఇచ్చింది; కానీ ఇవ్వాల్సిన 2000 కూడా రెండు నెలలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

కేసీఆర్ ఇస్తున్న బతుకమ్మ చీరలు ఒకటే, నేను గెలిస్తే రెండు ఇస్తామని చెప్పాడని మండిపడ్డారు. కానీ ఇపుడు కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు బందు, బతుకమ్మ చీరలు బందు, పెన్షన్లు బందు అని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా ముఖం లేదని అంటున్నారన్నారు. తెలంగాణ తల్లిని ఉద్యమంలో అందరూ మొక్కారు.

నేడు ఆ తల్లిని స్వయాన సీఎం రేవంత్ మన నుంచి వేరు చేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తల్లి ఎప్పటికైనా తల్లే; ఉద్యమంలో ఓ తల్లి పాలనలో మరో తల్లి ఉండడం సాధ్యమేనా? అని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జై తెలంగాణ నినాదాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన కావాలనే జై తెలంగాణ నినాదం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ సీఎంకు కోపం వస్తుందని తెలంగాణ పేరు ఎత్తడం లేదన్నారు.

ఏ రాష్ట్రం నాయకుడైనా తాను పుట్టిన గడ్డకు జై కొడతాడు. రేవంత్ రెడ్డి ఇక్కడి వాడు కాడేమో అంటూ ఆయన ఆరోపణలు చేసారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చినట్టుగానే చెప్పని పనులు చేస్తాడట అంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా, తెలంగాణ చిహ్నం మారుస్తానని అంటున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రెడ్డికి ఎంత అక్కసు ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన జై తెలంగాణ అనాల్సిందే అన్నారు.