వైసీపీ అంటే జగన్ తర్వాత టక్కున గుర్తొచ్చే పేరు విజయసాయిరెడ్డి ! పార్టీ అధినేత జగన్‌తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో.. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడంలో.. ఫ్యాన్ పార్టీని సోషల్ మీడియాలో దూకుడుగా నడిపించడంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు కూడా ! ఐతే ఆ బంధానికి ఇప్పుడు బీటలు వారుతున్నట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఇది ఇప్పుడు జరిగింది కాదు.. సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించినప్పటి నుంచే.. ఆయనను జగన్ కావాలని దూరం పెట్టడం స్టార్ట్ చేశారన్న ప్రచారం మొదలైంది. ఆ తర్వాత విశాఖలో భూముల ఆరోపణలు రావడం.. సాయిరెడ్డి అల్లుడిపై విమర్శలు వినిపించడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా జరిగింది. వరుస పరిమాణాలతో విజయసాయి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లోనూ వచ్చామంటే వచ్చాం అన్నట్లు అనిపించారు ఆయన ! ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండానే రాజ్యసభకు హాజరయ్యారు విజయసాయి. నిజానికి ఆయన అనుకుంటే ఓటు వేసి ఢిల్లీ వెళ్లడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ అలా జరగలేదు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
జగన్, సాయిరెడ్డి మధ్య ఏదో తేడా కొడుతుందనే ప్రచారం మొదలైంది. ఐతే విజయసాయికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు. తారకరత్న మరణం తర్వాత.. నందమూరి, నారా కుటుంబాలకు విజయసాయి దగ్గరయినట్లు కనిపించారు. చంద్రబాబు, బాలకృష్ణతో పక్కనే కూర్చొని విజయసాయి గంట తరబడి మాట్లాడడం… జగన్‌కు కోపం తెప్పించిందా ? అందుకే కావాలని దూరంగా పెట్టారా.. ఆ కోపంతోనే ఓటు వేయకుండా విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.