Devarakonda: ఒక్క టికెట్.. ఏడుగురు ‘నాయక్’ లు!

హస్తం పార్టీ టికెట్‌కు ఇంతగా డిమాండ్ ఏర్పడిన ఆ అసెంబ్లీ స్థానమే దేవరకొండ. ఈ స్థానం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, వడిత్య రమేష్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్, డాక్టర్ వడిత్య రవి నాయక్, నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్, రేఖ్యా నాయక్ ఉన్నారు

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 04:56 PM IST

Devarakonda: ఆ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ లీడర్ల మధ్య మామూలు ఫైట్ జరగట్లేదు!! ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఏడుగురు అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలన్నీ చేశారు. ఇక ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హస్తం పార్టీ టికెట్‌కు ఇంతగా డిమాండ్ ఏర్పడిన ఆ అసెంబ్లీ స్థానమే దేవరకొండ. ఈ స్థానం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, వడిత్య రమేష్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్, డాక్టర్ వడిత్య రవి నాయక్, నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్, రేఖ్యా నాయక్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఈ ఏడుగురిలో ముగ్గురి పేర్లను ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ఆయన ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి ప్రపోజల్ పంపిన లిస్టులో నేనావత్ బాలునాయక్, వడిత్య రమేష్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్ పేర్లు ఉన్నాయని సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన కాంగ్రెస్ నుంచి వెలువడలేదు. ఈనేపథ్యంలో దేవరకొండ నుంచి ఎవరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి వ్యక్తిత్వం, ప్రజల్లో ఉన్న బలాబలాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉన్న సంబంధాల ఆధారంగా ఒకరి పేరును మాత్రమే ఏఐసీసీ వర్గాలు తెలంగాణ పీపీసీకి పంపనున్నాయి.
మరోవైపు దేవరకొండ కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌, కాంగ్రెస్‌ ఆదివాసీ కో ఆర్డినేటర్‌ కిషన్‌నాయక్‌, వడ్త్య రమేశ్ నాయక్‌, కేతావత్‌ బిల్యానాయక్‌, డాక్టర్‌ రవినాయక్‌, రమావత్‌ జగన్‌లాల్‌నాయక్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దేవరకొండలో ఈ నేతలంతా వేర్వేరుగా తమ వర్గం నేతలతో మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కనీసం టికెట్స్ కన్ఫార్మ్ అయిన తర్వాతైనా ఏకతాటిపైకి వస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. ఒకవేళ ఇదేవిధంగా కాంగ్రెస్ నేతలు చెరో దిక్కుకు చీలిపోతే.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ విజయానికి లైన్ క్లియర్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దేవరకొండ గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గం. గత ఎన్నికల్లో (2018లో) ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఆర్‌.రవీంద్ర కుమార్‌ మూడోసారి విజయం సాధించారు. 2004, 2014 పోల్స్‌లోనూ సీపీఐ పక్షాన రవీంద్ర కుమార్‌ గెలిచారు. 2014లో కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ దేవరకొండ స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో రమావత్‌ రవీంద్ర కుమార్‌ తన సమీప టీడీపీ-బీజేపీ కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్‌‌పై 4216 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం దేవరకొండలో బలమైన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. అందుకే అక్కడ కాంగ్రెస్ టికెట్ అంత హాట్ కేకులా మారింది.