గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అవుతోన్న హీరోయిన్ జేత్వాని వ్యవహారంలో విచారణ పూర్తయింది. ఇందులో ఐపిఎస్ అధికారుల పాత్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు పోలీసులు. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా సమర్పించారు. పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, కుక్కల విద్యా సాగర్ పై కేసు నమోదు చేయాలని విచారణ అధికారి స్రవంతి రాయ్ నివేదికలో పేర్కొన్నారు. ఆమెను ఎలా వేధించారు అనే దానిపై సాక్ష్యాలను కూడా అధికారులు సేకరించారు. ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేసారు.
ఆ తర్వాత ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆమె అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతిరాణా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నారు. అనంతరం ముంబయికి వెళ్లి అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత రిమాండ్ కు పంపించి వేధించారు అని గుర్తించారు. రిమాండ్ కు పంపించడం, సహా మొత్తం వ్యవహారాన్ని కాంతిరాణా, విశాల్ గున్ని నేరుగా పర్యవేక్షించారని విచారణ అధికారులు గుర్తించారు.
జత్వానీ పేరిట ముంబయిలో స్టాంపు పేపర్ ను కొనుగోలు చేసి, 2018లో రాసినట్లు సృష్టించారని తేలింది. ఇందులో వైసీపీకి చెందిన ఒక లాయర్ కీలకంగా వ్యవహరించారట. ఒక ప్లాన్ వేసుకుని విమాన టికెట్ లు కూడా పోలీసులు బుక్ చేసుకుని ముంబై వెళ్ళారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జత్వానిపై ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి ఫిర్యాదు చేసారు. అదేరోజు ఉదయం 11.30కి విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబయికి వెళ్లి హీరోయిన్ ని ఆమె కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారట. ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు నివేదికలో స్రవంతి రాయ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా ఐపిఎస్ అధికారి పీ సీతారామాంజనేయులుగా విచారణ అధికారులు గుర్తించారు. వైసీపీలో ఉన్న ముఖ్యనేత చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన ఆయన… కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని ఇందులో ఇరికించాలి అనే దానిపై సూచనలు చేసారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి అందరూ ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా డీజీపీకీ నివేదిక ఇచ్చారు స్రవంతి రాయ్. ఇక ఈ వ్యవహారంలో తమ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉందనే భయంతో కొందరు పోలీసులు అప్రూవర్ లుగా మారినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.