SS Rajamouli: రాజమౌళితో అమిత్ షా భేటీ.. రాజకీయాలపైనే చర్చ..?

ఈ నెల 15, గురువారం ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం ఏడు గంటలకు రాజమౌళితో అమిత్ షా భేటీ అవుతారు.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 11:34 AM IST

SS Rajamouli: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శకధీరుడు రాజమౌళితో భేటీ కానున్నారు. గురువారం తెలంగాణలో పర్యటించబోతున్న అమిత్ షా ఈ సందర్భంగా రాజమౌళిని కలవనున్నారు. ఈ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ నెల 15, గురువారం ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.

సభ అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం ఏడు గంటలకు రాజమౌళితో అమిత్ షా భేటీ అవుతారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నోవాటెల్ హోటల్‌కు అమిత్ షా వెళ్తారు. అక్కడే రాజమౌళిని కలుస్తారు. అయితే, వీరి భేటీ ఏ అంశం ప్రాతిపదికగా జరుగుతుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు ఇప్పటికే బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. దీంతో ఆయన బీజేపీ సభ్యుడయ్యారు. ఆ రకంగా బీజేపీతో రాజమౌళికి పరోక్షంగానైనా సంబంధం ఉంటుంది. కాగా, తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ పార్టీని అధికారంలోకి తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

దీనికి అవసరమైతే సినీ గ్లామర్‌ను కూడా వాడుకోవాలని చూస్తోంది. దీనికోసం గతంలోనే ఎన్టీఆర్, నితిన్‌ వంటి సినీ ప్రముఖులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్‌ను అమిత్ షా సత్కరించారు. ఈ రకంగా టాలీవుడ్‌పై అమిత్ షా ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. రాజమౌళితో సమావేశంలో ప్రభాస్ కూడా పాల్గొనవచ్చనే ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మరొక సెలబ్రిటీ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.