ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అది ఎంత వరకు నిజమో కానీ ఒక్క వీడియో ఇండియాలో బీబీసీ రాతనే మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ఎంత వరకు నిజమన్న చర్చ పక్కన పెడితే దాని తర్వాత బీబీసీ స్టోరీయే మారిపోయింది. ఇప్పుడు కేసులు, దాడుల ఉచ్చులో చిక్కుకుని ఈ సంస్థ విలవిలలాడుతోంది. తాజాగా ఐటీ అధికారులు బీబీసీ ఆఫీసులపై పడ్డారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు ఈ మీడియా సంస్థపై వచ్చాయి. ఐటీ దాడులు కొత్తేమీ కాకపోయినా అది జరుగుతున్న సమయం మాత్రం కొత్త అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
బీబీసీ… బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్…. దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది… 1922లో ప్రారంభమైంది. బ్రిటన్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ కూడా… ముందుగా ప్రైవేట్ కంపెనీగా మొదలై తర్వాత పబ్లిక్ సర్వీస్ కార్పొరేషన్ గా మారింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో , వివిధ భాషల్లో సేవలు అందిస్తోంది. ఈ వందేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా బీబీసీకి ఓ క్రెడిబులిటి ఉంది. అలాంటి బీబీసీని ఒక్క వీడియో కుదిపేస్తోంది.
బీబీసీ ఇటీవలే ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా ది మోడీ క్వశ్చన్ పేరుతో ఎయిర్ చేసిన ఈ డాక్యుమెంటరీ ఓ దుమారాన్నే రేపింది. ప్రధాని మోడీ తప్పు చేశారన్నట్లుగా ఉండటం, ఓ సీక్రెట్ డాక్యుమెంట్ ను కోట్ చేయడం పెద్ద రచ్చకు దారి తీసింది. విదేశాంగశాఖ కూడా దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటు అధికార బీజేపీ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చాక బురద జల్లడం ఏంటన్నది బీజేపీ వాదన. ఉద్దేశపూర్వకంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీని ఎయిర్ చేసిందన్నది ఆ పార్టీ అనుమానం.
డాక్యుమెంటరీ వివాదం తర్వాత బీబీసీకి కష్టాలు మొదలయ్యాయి. బీబీసీని దేశంలో బ్యాన్ చేయాలన్న డిమాండ్ వచ్చింది. దానిపై కేసులు కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు ఇటీవలే ఆ డిమాండ్్ను తోసి పుచ్చింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అది సోదాలు కాదని సర్వే అని ఐటీ శాఖ చెబుతోంది. ఆ సర్వేకు అర్థమేంటన్నదే అర్థం కాని ప్రశ్న… ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు… ఇంకా ఆఫీస్్కు రాని ఉద్యోగుల్ని ఇంటి దగ్గరే ఉండిపొమ్మన్నారు… పలు డాక్యుమెంట్లను పరిశీలించారు.
బీబీసీపై ఏం ఆరోపణలు వచ్చాయన్నది ఐటీ శాఖ ఇంకా వెల్లడించలేదు. అయితే కొన్ని అంశాలపై వివరణ కోరుతూ నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై బీబీసీ స్పందించిందా లేదా అన్నది తెలియదు. బీబీసీ తప్పు చేసిందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు సోదాలు లేదా అధికారులు చెబుతున్నట్లు సర్వే జరిగిన సమయం మాత్రం కచ్చితంగా అనుమానాలు కలిగించేదే… దీనిపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. తమ వ్యతిరేకులపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయించడం బీజేపీకి అలవాటేనని ఇది కూడా అలాంటిదేనని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అదానీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీశాయి. కానీ దానిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రమే.. కానీ బీబీసీ విషయంలో మాత్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందన్నది ప్రతిపక్షాల ఆగ్రహం. దీన్ని బీజేపీ తిప్పికొడుతోంది. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయ సంస్థ అంటూ ఘాటు ఆరోపణలు చేస్తోంది. బీబీసీపై దాని స్వదేశం బ్రిటన్ లోనే దర్యాప్తు జరగడం లేదా అని ప్రశ్నిస్తోంది.
ఇక బ్రిటన్ ఈ వివాదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. మోడీ డాక్యుమెంటరీ వివాదం రగిలినప్పుడు కూడా ఆ దేశం అచితూచి స్పందించింది. ఇప్పుడు ఇది ఏకంగా ఐటీ దాడుల వరకు వెళ్లడంతో విదేశాంగశాఖ నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. బీబీసీ వందేళ్లలో ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు… వాటి నుంచి బయటపడి ఉండొచ్చు…. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందన్నది చూడాల్సి ఉంది.
(KK)