దక్షిణ భారత దేశంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ చేజేతులా వదులుకుంది. అతి విశ్వాసం, డబుల్ ఇంజిన్ సర్కార్, మోదీ చరిష్మా తమను గట్టెక్కిస్తాయని కమలనాథులు భావిస్తూ వచ్చారు. పైగా కాంగ్రెస్ పార్టీని చాలా తక్కువ అంచనా వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందని, ఆ పార్టీని నడిపించే నాయకుడు కూడా లేకుండా పోయారని.. ఎద్దేవా చేస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కానీ కర్నాటకలో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. మరి కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన అంశాలేంటి..?
డీకే – సిద్ధూ జోడీ
ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టుగానే కర్నాటక కాంగ్రెస్ లో కూడా అంతర్గత విభేదాలున్నాయి. నేతల మధ్య సయోధ్య లేదు. అధికారం కోసం, అధినాయకత్వం ప్రాపకం కోసం ఎగబడే నేతలున్నారు. అయినా కర్నాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలగిందంటే దానికి అనేక కారణాలు దోహదపడ్డాయి. ముఖ్యంగా మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎన్నికల వరకూ తమ మధ్య విభేదాలను పక్కన పెట్టారు. ఫస్ట్ బీజేపీని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీఎం సీటు గురించి ఆలోచిద్దామనుకున్నారు. లోపల ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నా పైకి మాత్రం కలసికట్టుగా పని చేసి సక్సెస్ సాధించారు.
40% సూపర్ సక్సెస్
ముఖ్యంగా బీజేపీ సర్కార్ 40శాతం కమిషన్ ను జనంలోకి బాగా తీసుకెళ్లారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యంగా బస్వరాజ్ బొమ్మై సీఎం సీటులో కూర్చున్నాక అవినీతి బాగా పెరిగిపోయింది. ఏ పని చేసినా 40శాతం కమిషన్ బీజేపీ నేతలకు ఇవ్వాలనే డిమాండ్ బహిరంగంగానే వినిపించడం మొదలైంది. ఇది బీజేపీని బాగా దెబ్బకొట్టింది. చిన్న పట్టణాల్లో కాంట్రాక్టర్లు సైతం ఈ విషయంలో బాధితులయ్యారు. బీజేపీ మళ్లీ వస్తే ఇది మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంటుందని.. కాబ్టటి ప్రజలంతా కమలం పార్టీని తరిమి కొట్టాలని కాంగ్రెస్ చేసిన ప్రచారం బాగా జనాల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ గెలుపనకు, బీజేపీ ఓటమికి ఇదే ప్రధాన కారణం.
ఒంటరిపోరు
గతంలో జేడీఎస్ తో పొత్తులపై ఆధారపడింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిసారీ ఆ ప్రయోగం విఫలమవుతూ వచ్చింది. మధ్యలోనే బీజేపీ జేడీఎస్ ను తన్నుకుపోవడమో, లేకుంటా కాంగ్రెస్ పార్టీని చీల్చడమో జరిగింది. అందుకే ఈసారి ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ప్రజల వద్దకే నేరుగా వెళ్లింది. క్లియర్ కట్ మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేసింది. అటూఇటూ కాకుండా తీర్పు ఇస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
రాహుల్ – ప్రియాంక – ఖర్గే ప్రచారం
కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం అగ్రనేతలంగా తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా ఇది ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంతరాష్ట్రం. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే విపక్షాలకు అనవసరంగా అవకాశం ఇచ్చినట్టవుతుంది. అందుకే ఖర్గే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్, ప్రియాంకలను ప్రచారంలోకి దించారు. వాళ్లను విరివిగా వాడుకున్నారు. ఇదే సమయంలో గతంలో కోలార్ లో రాహల్ చేసిన ప్రచారంపై పార్లమెంట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఇది కూడా బీజేపీ కక్షసాధింపును ఎత్తిచూపింది. ఇక ప్రియాంక చరిష్మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో దోహదపడింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో కర్నాటకలో విజయం ఆ పార్టీకి నైతికంగా ఎంతో బలాన్నిచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు, ఈ ఏడాదిలో జరగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక విజయం కచ్చితంగా బాటలు పరుస్తుంది.