Shock to YCP: వైసీపీకి షాక్.. టీడీపీకి ఓటేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు!

ఉండవల్లి శ్రీదేవి, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరి, అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై వైసీపీ అధిష్టానానికి అనుమానం ఉండేది. అయితే వీళ్లందరితో మాట్లాడి దారికి తెచ్చుకుంది. అయినా రెండు ఓట్లు ప్రత్యర్థికి ఎలా పడ్డాయనేది ఇప్పుడు వైసీపీకి అంతు చిక్కడం లేదు.

  • Written By:
  • Updated On - March 23, 2023 / 08:03 PM IST

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. అధికార పార్టీ ఎంత ధీమాగా ఉన్నా… తన చాణక్యం ముందు తట్టుకోలేరని చంద్రబాబు నిరూపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఓడిపోయింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ ఘన విజయం సాధించారు. 7సీట్లకు గానూ ఏడింటిలోనూ గెలుపొందాలని వైసీపీ ఎన్ని ప్లాన్లు వేసినా వర్కవుటు కాలేదు. నాలుగు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించి, ఎమ్మెల్యేలపై నిఘా పెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను సీఎం స్వయంగా బుజ్జగించినా వైసీపీకి పరాభవం తప్పలేదు.

7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ లో 6 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నాయి. 7 సీట్లను గెలుచుకునేంత సంఖ్య అధికార వైసీపీకి ఉన్నా ఓడిపోవడమే ఇప్పుడు పెద్ద చర్చ. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చారు. దీంతో వైసీపీ బలం 156కు పెరిగింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీకి ఉన్న 154 మందితో 7 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకోవడానికి సరిపడా బలం ఉన్నట్టే. అయినా వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు.

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు 23 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాస్తవానికి సభలో టీడీపీ బలం 23. అయితే నలుగురు వైసీపీలోకి వెళ్లిపోవడంతో పార్టీ బలం 19కి పడిపోయింది. వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తే 21 మంది అవుతారు. అయినా టీడీపీ అభ్యర్థి గెలవాలంటే మరొక ఓటు కావాలి. అధికార పార్టీ నుంచి మరో ఓటు సాధించడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. ఇది ఎవరూ ఊహించలేదు.

టీడీపీ అభ్యర్థిని నిలిపినప్పటి నుంచి వైసీపీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. అనుమానాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడింది. ఉండవల్లి శ్రీదేవి, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరి, అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై వైసీపీ అధిష్టానానికి అనుమానం ఉండేది. అయితే వీళ్లందరితో మాట్లాడి దారికి తెచ్చుకుంది. అయినా రెండు ఓట్లు ప్రత్యర్థికి ఎలా పడ్డాయనేది ఇప్పుడు వైసీపీకి అంతు చిక్కడం లేదు.