Telangana Elections : సామాజిక న్యాయంతో ఓట్ల వేట.. మొన్న బీసీలకు – నిన్న ఎస్సీలు.

తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బీసీలను సీఎం చేస్తామని ప్రకటించింది.

తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బీసీలను సీఎం చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ మాదిగలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ రెండు వర్గాలు రాష్ట్రంలో మాగ్జిమమ్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని కమలం పార్టీ ఆలోచన. ఎస్సీ వర్గీకరణపై తొమ్మిదిన్నరేళ్ల పాటు కాలక్షేపం చేసి ఇప్పుడు ఓట్ల కోసమే ప్రకటనలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మండిపడుతున్నాయి.

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. రెండు నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని కులాలతోనూ వరుసగా మీటింగ్స్ పెడుతోంది బీఆర్ఎస్. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆయా వర్గాల వారి సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రకటించింది. రైతులు, యూత్, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ డిక్లరేషన్ల పేరుతో.. తమకు అధికారం ఇస్తే హామీలన్నీ అమలు చేస్తామంటోంది.

KCR : గజ్వేల్‌లో కేసీఆర్‌కు మరో షాక్‌.. గట్టెక్కగలరా ?

బీజేపీ అయితే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే.. మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆ వర్గం వారిని ఆకర్షించింది. ఆ తర్వాత బీసీలను ఆకట్టుకోవడానికి తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి చేస్తామని స్వయంగా ప్రధాని మోడీయే బీసీ గర్జనలో హామీ ఇచ్చారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే మళ్లీ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ.. ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపిస్తామని చెప్పారు. దాంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న మాదిగల ఓట్లను తమ వైపు టర్న్ చేసుకునే ప్రయత్నంలో ఉంది కమలం పార్టీ.

బీసీ కార్డును ఇప్పుడు వాడుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల దాడి చేశాయి. బీసీ గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించిన.. కిషన్ రెడ్డికి ఎందుకు బాధ్యతలు ఇచ్చారని ప్రశ్నించాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపైనా విమర్శలు చేస్తున్నాయి. తొమ్మిదిన్నరేళ్ల ఎన్నో కమిషన్లు రికమండ్ చేసినా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానించినా ఏమీ పట్ట నట్టుగా ఉన్న NDA సర్కార్.. ఇప్పుడు కళ్ళు తెరిచిందా.. ఓట్ల కోసమే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. అటు బీజేపీ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం.. రాష్ట్రంలో ఉన్న బీసీ లతో పాటు.. ఎస్సీల్లో ఎక్కువ ఓటర్లున్న మాదిగల ఓట్లు, మహిళల ఓట్లు తమ పార్టీకే వస్తాయని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో 41 శాతం ఓట్లు రావడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో ఈసారి అన్ని పార్టీలు సామాజిక న్యాయం చేస్తామంటూ వివిధ కులాల ఓట్లను పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.