ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ లెక్కలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనుకున్నా పక్కా లెక్కలతో ఒక ప్లానింగ్, ఒక విజన్ తో అడుగులు వేస్తూ ఉంటారు. అది సినిమాలు చేసినా… రాజకీయం చేసినా వాళ్ళ లెక్క వాళ్ళకుంటుంది. ఎక్కడైనా ఎదురు దెబ్బ తగిలితే అక్కడ నుంచి మళ్లీ ఎలా ముందుకు వెళ్లాలో వాళ్లకు ఉన్నంత క్లారిటీ తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరికి ఉండదు. అందుకే దశాబ్దాలుగా మెగా ఫ్యామిలీ తెలుగు సినిమా పరిశ్రమను శాసిస్తోంది. ఎదురు తిరుగుతాయి అనుకుంటే వారిని ఎలా కూల్ చేయాలో వాళ్ళకి మంచి క్లారిటీ ఉంటుంది.
అయితే రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి పెద్దగా జోక్యం చేసుకున్నట్టు ఎక్కడా కనపడలేదు. గతంలో కేసీఆర్, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి వాళ్ళతో చాలా సన్నిహితంగా మెలిగిన చిరంజీవి అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండే అవకాశం లేదని స్పష్టంగా చెప్పినా సరే చిరంజీవి మాత్రం నోరు మెదపలేదు. ఇక రేవంత్ రెడ్డితో భేటీ కోసం సినిమా పరిశ్రమ పెద్దలందరూ వెళ్లినా చిరంజీవి మాత్రం వెళ్లే సాహసం చేయలేదు.
అయితే ఆయన వెళ్ళకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి చిరంజీవికి ఒక అవగాహన ఉంది. ఆయన కచ్చితంగా బెనిఫిట్ షో ల విషయంలో వెనక్కు తగ్గే ఛాన్స్ లేదనేది క్లియర్ కట్ గా చిరంజీవికి అర్థమైంది. అసెంబ్లీలో మాట్లాడిన మాటపై తగ్గరు అనే అవగాహన ఉంది. అలాగే అక్కడికి వెళితే అల్లు అర్జున్ వ్యవహారాన్ని కచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారు అనేది చిరంజీవి ముందుగానే అంచనా వేసుకున్నారు. చిరంజీవి అంచనాకు తగ్గట్టుగానే వీడియోతో సహా అల్లు అర్జున్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళందరికీ ప్రత్యక్షంగా చూపించారు.
ఇక ఇవన్నీ తెలిసిన చిరంజీవి అనవసరంగా వెళ్లి ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయారు. ఈరోజు ఉదయం వరకు చిరంజీవి వెళతారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. గతంలో వైయస్ జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక రకంగా జగన్ ను శాంతింప చేసిన చిరంజీవి… రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. అల్లు అర్జున్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి నోటి నుంచి ఒక్క మాట కూడా మద్దతుగా కాని వ్యతిరేకంగా గాని రాలేదు.
ఫార్మాలిటీకి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వస్తే టీ తాగి… నాలుగు ఫోటోలు దిగడమే కానీ చిరంజీవి పెద్దగా జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎన్ని విధాలుగా చెప్పినా రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తాను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. తనను బతిమిలాడే అవకాశం కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి వెళితే రేవంత్ రెడ్డి కరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇక అక్కడికి వెళ్లి విజ్ఞప్తులు… క్షమాపణలు.. దండాలు… నమస్కారాలు.. కుశల ప్రశ్నలు, ఆర్టిఫిషియల్ నవ్వులు ఎందుకని భావించిన చిరంజీవి మీరు వెళ్లి రండి అంటూ తన తరఫునుంచి సాయిధరమ్ తేజ్ ను పంపించారు. సాయి ధరమ్ తేజ్ కూడా అక్కడ ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళేం మాట్లాడుతున్నారో విని బయటకు వచ్చేసాడు.