IPAC team in AP: మనల్నెవర్రా ఆపేది.. హద్దుదాటుతున్న ఐప్యాక్ టీం.. అధికారిక సమావేశాలకూ హాజరు..

గుంటూరులో శనివారం జరిగిన మున్సిపల్ సమావేశానికి ఐప్యాక్ టీం సభ్యులు హాజరయ్యారు. పైగా ఈ టీం సందర్శకులు కూర్చునే చోట కూర్చుంటే ఏ సమస్యా ఉండేది కాదేమో. కానీ, అధికారులు కూర్చునే చోట కూర్చున్నారంటే ఎంతగా వీరి ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Written By:
  • Updated On - June 25, 2023 / 12:03 PM IST

IPAC team in AP: ఏపీ సీఎం జగన్‌కు ఐప్యాక్ టీం ఎంత చెబితే అంత. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐప్యాక్ చెప్పిందే జగన్, సజ్జల అండ్ కో పాటిస్తుంటారు. పాలనలోనూ ఐప్యాక్ ముద్ర కనిపిస్తుంది. జగన్‌కు, పార్టీ నేతలకు రాజకీయాలు, పాలనలో సలహాలివ్వడం, పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించడం వంటి సేవల వరకు ఐప్యాక్ పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, ప్రభుత్వ అధికారిక సమావేశాలకు కూడా ఐప్యాక్ టీం హాజరవుతుండటం సంచలనం సృష్టిస్తోంది. దీన్నిబట్టి ఐప్యాక్ టీం ప్రభుత్వంపై ఎంతగా పెత్తనం చెలాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
గుంటూరు మున్సిపల్ సమావేశానికి హాజరు
గుంటూరులో శనివారం జరిగిన మున్సిపల్ సమావేశానికి ఐప్యాక్ టీం సభ్యులు హాజరయ్యారు. పైగా ఈ టీం సందర్శకులు కూర్చునే చోట కూర్చుంటే ఏ సమస్యా ఉండేది కాదేమో. కానీ, అధికారులు కూర్చునే చోట కూర్చున్నారంటే ఎంతగా వీరి ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఉండాల్సిన కుర్చీల్లో ఐప్యాక్ టీం సభ్యులు కనిపించడంతో టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అక్కడేం పని అంటూ ఐప్యాక్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని సూచించారు. దీంతో ఐప్యాక్ టీం సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ సమావేశం అంటే.. స్థానిక ప్రభుత్వ, అధికారిక సమావేశం. అలాంటి సమావేశానికి దర్జాగా వచ్చి ఐప్యాక్ టీం కూర్చోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ సభ్యులే వారిని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది.
రెండో ప్రభుత్వ వ్యవస్థ
సాధారణంగా ప్రజలు ఎన్నుకున్న పాలకులు, అధికారులు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. కానీ, ఏపీలో మాత్రం ఐప్యాక్ టీం ఇంకో పాలనా వ్యవస్థగా తయారైందా అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పాలకులు, అధికారులతోపాటు పలు సమావేశాలకు ఐప్యాక్ టీం సభ్యులు కూడా హాజరవుతుంటారు. అక్కడ వైసీపీ నేతలు, ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తుంటారు. ఇదంతా వైసీపీ ఆఫీసులోనో, నేతల ఇండ్లలోనో జరిగితే తప్పులేదు. కానీ, నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోకి చొరబడి, తమపని చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిద్వారా వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశాల ద్వారా నివేదిక తయారు చేసుకుని.. తదుపరి ఎలా నడుచుకోవాలి.. ఏం చేయాలి వంటివి ఐప్యాక్ నేతలకు సూచిస్తుంది. దీంతో ఐప్యాక్ టీం చెప్పినట్లు నేతలు, ప్రభుత్వం నడుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇక్కడ ఐప్యాక్ టీంను రిషిరాజ్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడో కంప్యూటర్ల ముందు పని చేసుకోవాల్సిన ఐప్యాక్ టీం ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడటం నిజంగా అడ్డుకోవాల్సిన అంశమే. వైసీపీ పెద్దల సూచనమేరకే ఐప్యాక్ టీం ఇలా చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేల వ్యతిరేకత
వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోటా ఐప్యాక్ టీం ఉంటుందని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ఐప్యాక్ టీం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి, జగన్‌కు అందిస్తుంది. అలాగే నియోజకవర్గ రాజకీయాల్లో, పాలనలో కూడా ఈ టీం పెత్తనం చెలాయిస్తుంది. ఈ టీం సూచనల ప్రకారమే జగన్ నిర్ణయం తీసుకుంటారు. జగన్‌కు ఈ టీంపై అంత నమ్మకం. ఈ టీం సర్వే చేసి 70 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చాలని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వీళ్లే అంటూ ప్రచారం కూడా మొదలైంది. ఇది నిజమే అని ప్రజలు నమ్మేలా తయారైంది పరిస్థితి. దీంతో తమ ఇమేజ్ దెబ్బతింటుందని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేశారు కూడా. తమ నియోజకవర్గాల్లో ఐప్యాక్ టీం సాగిస్తున్న ధోరణిపై కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని విమర్శల మధ్య ఇకనైనా ఐప్యాక్ టీం తన పనితీరు మార్చుకుంటుందా.. లేదా మమ్మల్నెవరు ఆపేది అంటూ ఇలాగే దూసుకెళ్తుందా.. అన్నది చూడాలి.