జగన్ ప్లాన్ కు ఐకాన్ స్టార్ పవర్ బ్రేక్స్…? మెగాస్టార్ మాస్టర్ మైండ్…?

పుష్ప సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో, అలాగే ఇండియన్ సినిమాలో ఎంత సంచలనం అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఈ సినిమా ఎన్నో ఊహాగానాలకు తెరలేపింది. రాజకీయంగా వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీగా సినిమా యుద్ధాన్ని మొదలుపెట్టింది పుష్ప 2.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 12:10 PM IST

పుష్ప సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో, అలాగే ఇండియన్ సినిమాలో ఎంత సంచలనం అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఈ సినిమా ఎన్నో ఊహాగానాలకు తెరలేపింది. రాజకీయంగా వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీగా సినిమా యుద్ధాన్ని మొదలుపెట్టింది పుష్ప 2. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ అలాగే మెగా అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక సోషల్ మీడియా వరికే ఇది పరిమితం కాకుండా బహిరంగ విమర్శలకు కూడా వేదిక అయింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమాను తాము అడ్డుకుంటామంటూ జనసేన నేతలు ప్రకటనలు కూడా చేశారు. దానికి తోడు సినిమా రిలీజ్ రోజు సినిమాలో లేని డైలాగులు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. “ఎవడికి రా బాస్ వాడికి వాడి తమ్ముడికి వాడి కొడుకుకి కూడా నేనే బాస్” అంటూ పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినట్టుగా కొన్ని డైలాగులు వైరల్ చేశారు.

అలాగే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని కూడా కొన్ని డైలాగులు సినిమాలో ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ డైలాగులు ఏవి సినిమాలో లేవు. ఇక దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వైయస్ జగన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు అలాగే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు… అలాగే మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు అన్నీ కూడా వైరల్ అయ్యాయి.

ఇక వైసిపి ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ ను తమ వాడిగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. పుష్ప సినిమా తొలి రోజు వసూళ్లను గురించి అంబటి రాంబాబు పోస్ట్ చేస్తూ 294 కోట్లు వసూలు చేసింది మనవాడి సినిమా అని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి కొన్ని అంశాలను సున్నితంగా పరిశీలిస్తే వైయస్ జగన్ కాపు ఓట్లను అల్లు అర్జున్ ద్వారా టార్గెట్ చేశారనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ద్వారా కాపు ఓట్లు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పడ్డాయి.

వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో అల్లు అర్జున్ ను కాపు సామాజిక వర్గంలో ఒక స్టార్ హీరోగా ప్రమోట్ చేయడానికి వైసిపి కంకణం కట్టుకుంది. అందుకే రాంగోపాల్ వర్మ కూడా మెగా ఫ్యామిలీలో నువ్వే మెగాస్టార్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. కాపు ఓట్లను అల్లు అర్జున్ ను అడ్డంగా పెట్టుకుని పెద్ద ఎత్తున కొల్లగొట్టాలని అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ఉన్న మెగా అభిమానులు కూడా తన వైపుకు తిప్పుకోవడానికి అల్లు అర్జున్ ను వాడుకోవాలని జగన్ ప్రయత్నాలు చేసినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ తరుణంలో అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ చూసి వైసిపి లో ఉన్న కొందరు షాక్ అయ్యారు. అల్లు అర్జున్ ను అనవసరంగా పైకి లేపామని సోషల్ మీడియాలో తమ ఆవేదన ఆక్రోషం అన్ని వెళ్ళగక్కారు. అల్లు అర్జున్ ను తమ వాడిగా చెప్పుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా దాదాపుగా ఫెయిల్ అయినట్టుగానే కనపడుతుంది. పుష్ప సినిమా గోదావరి జిల్లాలో అలాగే హైదరాబాదులోని కొన్ని థియేటర్స్ లో అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొడుతుందని అంచినా వేశారు అల్లు అర్జున్ అలాగే మైత్రి మూవీ మేకర్స్. కానీ తీరా సినిమా చూస్తే మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ ఒక్కడే పోరాటం చేయడం సాధ్యం కాదనే విషయం అల్లు ఫ్యామిలీకి క్లారిటీ వచ్చింది. దీనితో పవన్ కళ్యాణ్ ను… కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ మాట్లాడటం చూసి వైసిపి నివ్వెర పోయింది. దీనిని గమనిస్తున్న జనాలు జగన్ కాపు ఓట్ల వ్యూహానికి పవర్ స్టార్ బ్రేకులు వేశారని మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో మాస్టర్ మైండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని ముందే గ్రహించిన మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం చేసుకోకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం కూడా చేసింది. జనసేన పార్టీకి నష్టం జరగకుండా చిరంజీవి వ్యవహరించారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అల్లు అరవింద్ ద్వారా బన్నీని కాస్త కూల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా పరిస్థితి అర్థం కావడంతో మెగా ఫ్యామిలీకి దూరం జరగకుండా ఉండటమే మంచిది అని ఒక అంచనాకు వచ్చేసాడు. అటు హైదరాబాద్ లో మహిళ మరణం కూడా పుష్పకు నెగటివ్ గా మారడంతో మెగా ఫ్యామిలీనే దిక్కు అయిందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.