జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను కోవింద్ కమిటీ అందించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యకత ఉందని తెలిపింది. ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని పేర్కొంది.
జమిలి ఎన్నికలకు రెండంచల విధానం సిఫారసు చేసింది కమిటీ. మొదట లోక్‌సభ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు… మొదటి దశ పూర్తైన వంద రోజుల్లోపు… రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఏదేని కారణం చేత పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని సిఫారసు చేసింది.
జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వీటికి ఆమోదం తెలపాలి అంటే… మొదట లోక్ సభ లో ఆమోదం పొందాలి. తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. తదుపరి దేశం మొత్తం మీద సగం కన్నా ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం ఆమోదించి పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తరువాతే చివరి గా రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రం ఈ ప్రయత్నం చేయకపోవచ్చు.