Pawan Kalyan: వారాహి యాత్రతో పవన్‌ మైలేజ్ పెరిగిందా.. టీడీపీ, చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైందా ?

వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి గోదావరి జిల్లాలో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. జనాలను కలుసుకుంటూ.. సమస్యలు తెలుసుకుంటూ.. ధైర్యం నింపుతూ.. వాళ్ల మనసులు గెలుస్తూనే.. వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 02:54 PM IST

ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఏ ఒక్క స్థానంలోనూ వైసీపీ ఖాతా తెరవకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని.. పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్న పవన్‌.. జనసైనికుల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇక అటు తన మాటకు కూడా పదును పెంచారు. రౌడీలు, గూండాలు, హంతకుల పాలనలో సాగుదామా.. బతుకులు మార్చుకుందామా అంటూ.. వైసీపీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారాహి యాత్రకు ముందు.. వారాహి యాత్రకు తర్వాత అన్నట్లుగా పవన్‌ గ్రాఫ్‌, తీరు కనిపిస్తోందిప్పుడు ! పవన్ ప్రసంగాలు రాజకీయంగా సంచలనం క్రియేట్ చేస్తున్నాయ్.

దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే జనసేన గ్రాఫ్ భారీగా పెరిగింది. వారాహి యాత్ర తర్వాత ఆ గ్రాఫ్ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అందుకే పవన్ మాట మార్చినట్లు కనిపిస్తున్నారు. సింగిల్‌గా వస్తానో.. పొత్తుగా వస్తానో తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు ఆశే లేదని ఇన్నాళ్లు ప్రకటించిన పవన్.. ఇప్పుడు మాత్రం తానే సీఎం అవుతానని ప్రకటన చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనల వెనక.. పార్టీ గ్రాఫ్ పెరగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

నిన్న మొన్నటివరకు టీడీపీ మీదే ఎక్కువ ఆధారపడినట్లు కనిపించిన సేనాని.. పెరిగిన బలంతో మనల్ని ఎవడ్రా ఆపేది అనే లెవల్‌లో.. తానే సీఎం అని ప్రకటనలు చేస్తున్నారు. వారాహియాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ పెరగడం.. టీడీపీ కొన్నిచోట్ల రోజురోజోకు వీక్ మారుతున్నట్లు సర్వేలు చెప్తుండడంతో.. పవన్ రూట్ మార్చినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. ఎన్నికల సమయంలోనే పొత్తులపై ప్రకటన చేస్తానని చెప్తూనే.. తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతాలను టీడీపీకి పంపిస్తున్నారు పవన్‌.

వారాహి యాత్రకు వస్తున్న స్పందనతో కంపేర్ చేస్తే.. లోకేశ్‌ యువగళానికి ఆ రేంజ్ రియాక్షన్ కనిపించడం లేదు. దీంతో టీడీపీ, చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైందనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఇది పవన్‌కు కూడా తెలుసు. రేపటి రోజు పొత్తుల ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పుడు.. తన బలాన్ని చూపించి.. పవన్ 50 సీట్లు అడిగే అవకాశం ఉందనే టెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. జనసేనకు బలం పెరిగితే తమకు నష్టం మొదలైనట్లే అనే ఆందోళన.. టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో పొత్తులు ఎత్తులు.. ఎన్నికల నాటికి మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయని క్లియర్‌గా అర్థం అవుతోంది.