ఏపీలో ఎన్నికల (AP Elections) ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4 దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలతో పాటు జనంలోనూ టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది. జగన్ (Jagan), చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మెజారిటీలు ఎంత ఉంటాయి. ఇలా రకరకాలుగా నియోజకవర్గాల వారీగా ఏపీలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. కౌంటింగ్ కి టైమ్ దగ్గర పడటంతో ఓ రకంగా ఏపీలో పీక్స్ కి చేరాయి బెట్టింగ్స్. లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ(YCP), కూటమి మధ్య హోరా హోరీ ఫైట్ నడిచింది. దాంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. సరిగ్గా ఈ స్ట్రాంగ్ పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్నాయి బెట్టింగ్ ముఠాలు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కి చాలా టైమ్ గ్యాప్ రావడంతో… వందల కోట్ల రూపాయలు ఏపీలో చేతులు మారుతున్నాయి. ఈ పందేలు ఎక్కువగా 3 కేటగిరీల్లోనే నడుస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత ఉంటుంది అనే దానిపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఇది కాకుండా చంద్రబాబు, జగన్ మెజారిటీలపైనా కూడా బెట్టింగ్స్ పెడుతున్నారు. పిఠాపురం (Pithapuram) లో వైసీపీ అభ్యర్థి వంగా గీతను పవన్ కల్యాణ్ ఓడించడం ఖాయమని అంచనాలు రావడంతో… జనసేనాని మెజారిటీపైనే పందేలు కడుతున్నారు. 40 వేలు, 50 వేల మెజారిటీ వస్తుందంటూ బెట్టింగ్స్ నడుస్తున్నాయి.
ఇక కుప్పంలో చంద్ర బాబు, పులివెందులలో జగన్ మెజార్టీపైనా లక్షకు 5 లక్షల రూపాయల చొప్పున పందేలు హైరేంజ్ లో నడుస్తున్నాయి. జగన్ వర్సెస్ కూటమిపైనా జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు, మూడు రోజుల్లోనే వందల కోట్ల నగదుతో పాటు… ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు లాంటి వాటిని కూడా బెట్టింగ్స్ లో పెడుతున్నారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే… పందెం గెలిస్తే బెంజ్ కార్ లేకపోతే… బేకార్ అవడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఓడిపోయిన వాళ్ళు కట్టు బట్టలతో మిగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా 4వ తారీకున.. కొందరి నుదిటి రాతలు మారే రోజు అని విశ్లేషకులు చెబుతున్నారు.