సంధ్య థియేటర్ ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందనేది గత వారం పది రోజుల నుంచి స్పష్టత వస్తుంది. అయితే శనివారం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కామెంట్స్ తర్వాత ఈ వ్యవహారం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉందనే విషయం క్లారిటీ చాలా మందికి ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గకపోవడం… ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కామెంట్ చేయడం చూస్తుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ విషయంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
చిక్కడపల్లి ఏసీపీ వద్దని చెప్పినా అల్లు అర్జున్ వచ్చాడని, సినిమాపై 2000 కోట్లు కలెక్ట్ చేశారని పది కోట్లు ఇస్తే పోయేదేముందని ఆయన నిలదీశారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి సూపర్ స్టార్ అయితే ఏంటి అని నిలదీశారు. బాధిత కుటుంబానికి 20 కోట్లు ఇవ్వాలని సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కామెంట్స్ చూసిన చాలామంది ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాలంటే ఆ కుటుంబానికి 20 కోట్లు ఇస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా వెనక తగ్గే సంకేతాలు ఏమి కనబడటం లేదు. అయితే ఆ కుటుంబానికి సహాయం చేస్తానని చెప్తున్నాడే గాని ఎంత ఇస్తాడు ఏంటనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ముందు 25 లక్షలు ఇచ్చినట్లు ప్రకటించినా, ఆ తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి అలాగే భవిష్యత్తు విషయంలో తాను చూసుకుంటానని హామీ ఇచ్చినా… ఇప్పటివరకు అసలు ఎంత ఇస్తాడు ఏంటనే దానిపై కూడా స్పష్టత లేదు.
చిన్నారికి సుకుమార్ అలాగే మైత్రి మూవీ మేకర్స్, తాను కలిసి ఒక మంచి అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించాడు. కానీ అమౌంట్ ఏంటి అనేది అల్లు అరవింద్ చెప్పమని చెప్పిన సరే అల్లు అర్జున్ మాత్రం చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తే ఆ కుటుంబానికి ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని ఇంకో పదిహేను లక్షలు ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం… ఆ కుటుంబానికి సహాయం చేస్తే ఊరుకుంటుందా లేదంటే తదుపరి చర్యలకు సిద్ధమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ కు బెయిల్ రద్దు చేయాలని కూడా కోరే సంకేతాలు కనబడుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేయాలని భావిస్తున్నారు.