Telangana Politics : ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోల్డ్ వార్.. ?

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసినప్పటి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద మధ్య దోబూచులాట నడుస్తోంది. ఒకరి ప్రోగ్రాంలో ఇంకొకరు పాల్గొనకుండా మొహం చాటేస్తున్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీదండు రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద వర్సెస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నట్టుగా లోకల్ పాలిటిక్స్ సాగుతున్నాయి. మంత్రి హరీశ్ రావు చొరవతో వారం కిందటే వీరిద్దరు ఒక ప్రోగ్రామ్ లో కలుసుకున్నప్పటికీ.. విభేదాలు మాత్రం సద్దుమణగలేదు. ఇటీవల కుత్బుల్లాపూర్ లోని బహదూర్ పల్లి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి.. ఈ నియోజకవర్గంలోనే నివసించే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరు కాలేదు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్యే కృష్ణారావు తప్ప ఇతర ముఖ్య నేతలెవరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనలేదు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఎమ్మెల్యే వివేకానంద నుంచి ఆహ్వానం అందలేదని తెలిసింది. గతంలో వీరిద్దరు ఒకరినొకరు ఆహ్వానించుకొని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రెండేళ్లుగా విభేదాల కారణంగా అలా జరగడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫస్ట్ లిస్టు వచ్చినప్పటి నుంచి..

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసినప్పటి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద మధ్య దోబూచులాట నడుస్తోంది. ఒకరి ప్రోగ్రాంలో ఇంకొకరు పాల్గొనకుండా మొహం చాటేస్తున్నారు. ఈ పంచాయతీ మంత్రి హరీశ్ రావు దగ్గరికి చేరడంతో.. కలిసి ముందుకుసాగాలని ఎమ్మెల్యే వివేకానందకు సూచించారని తెలుస్తోంది. హరీశ్ రావు ఈ సూచన చేసిన మరుసటి రోజే.. ఎమ్మెల్యే వివేకానంద వెళ్లి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిశారు. అయినప్పటికీ ఆ ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదు. దీంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డైలమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న భయంతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహించగా, కుత్బుల్లాపూర్‌లో మాత్రం అలాంటివేం జరగకపోవడం గమనార్హం.

మల్కాజిగిరి అసెంబ్లీ కోసం శంభీపూర్‌ రాజు..

మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ పొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఆ స్థానంలో ప్రత్యామ్నాయ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈనేపథ్యంలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లు కూడా గులాబీ బాస్ పరిశీలనలో ఉన్నాయట. ఇక మైనంపల్లికి కాంగ్రెస్‌ పార్టీ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు సమాచారం. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్‌ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.