PM MODI: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే వస్తుందని, తానే మూడోసారి ప్రధాని అవుతానని చెప్పారు. తాను మళ్లీ గెలిస్తే ఇండియా.. ప్రపంచంలోని మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బుధవారం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ మాట్లాడుతూ “20141లో బీజేపీ అధికారం చేపట్టేటప్పటికీ ఇండియా పదో ఆర్థిక శక్తిగా ఉండేది. మేం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇండియా ఇప్పుడు ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేంద్రంలో మూడోసారి కూడా మేమే అధికారం చేపడతాం. మూడోసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇండియా మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. గడిచిన తొమ్మిదేళ్లలో రూ.34 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో కూడిన దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం. కానీ, ప్రతికూల ఆలోచనలతో ఉన్న కొందరికి అభివృద్దిని అడ్డుకోవడమే పని. ప్రతిపక్షాలు అన్నిరకాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ వాళ్లు ముఖాలు అలాగే ఉంటాయి. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వాళ్ల ఆశలు నెరవేరవు. తూర్పు నుంచి పడమర వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు దేశంలో నిర్మాణరంగం మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జి ఇండియాలోనే ఉంది. అతిపెద్ద విగ్రహం, ఎత్తయిన ప్రాంతంలోని టన్నెల్, ఎత్తైన రోడ్డు, స్టేడియం వంటివి ఇండియాలోనే ఉన్నాయి” అంటూ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రధాని మోదీ మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, తానే ప్రధాని అవుతానని వ్యాఖ్యానించడం విశేషం. దేశాన్ని ఆర్థికంగానూ పరుగులు పెట్టించి, ప్రపచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలుపుతామనే ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ జీ20 సదస్సుకు సంబంధించిన నాణెం, స్టాంపు విడుదల చేశారు.