Joe Biden: బైడెన్ బాబాయ్ కుర్చీ వదిలెయ్…!

ట్రంప్, బైడెన్ ఎవరికి వారు తామే అధ్యక్ష అభ్యర్థులమని చెప్పుకుంటున్నప్పటికీ అభ్యర్థులను తేల్చాల్సింది ఆయా పార్టీల క్రియాశీలక కార్యకర్తలే... పోటీకి సిద్ధమైన అందరి మధ్య ఓటింగ్ జరిగి చివరకు ఒకరిని తమ పార్టీ అభ్యర్థిగా వారే ఖరారు చేస్తారు.

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 12:29 PM IST

కుర్చీ వదలాలని ఏ రాజకీయ నాయకుడికీ ఉండదు… అందులోనూ అగ్రరాజ్యం అధ్యక్షుడు అయితే అసలు వదల్లేరు. బైడెన్ కూడా ప్రెసిడెంట్ అన్న పదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా నా సీటు నాకే కావాలి అంటున్నారు బైడెన్…

2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించిన హడావుడి ఇప్పటికే మొదలైంది. రెండు పార్టీల్లోనూ ఆశావహులు మేం పోటీకి సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. రిపబ్లికన్లలో ట్రంప్ ఎప్పట్నుంచో పోటీపై కన్నేశారు. 2020లోనే సీటు వదులుకోవడానికి ఇష్టపడక నానాయాగీ చేసిన ట్రంప్.. మరోసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనకు పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థిగా తానే రంగంలో ఉండాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇక డెమొక్రాట్లలో కూడా పోటీ తక్కువేం లేదు. ప్రస్తుతం అధికారం వారిదే… అయితే ఎంతమంది యంగ స్టర్స్ పోటీకి రెడీ అంటున్నా మరోసారి నేను కూడా పోటీ చేస్తా అంటూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు అధ్యక్షుడు జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వరుసగా రెండోసారి అదే పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం కొత్తేమీ కాదు… వింత అంతకన్నా కాదు… కానీ బైడెన్ పోటీ చేస్తాననడమే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బైడన్ వయసు ఇప్పటికే 80.. 2024లో ఎన్నికలు జరిగే నాటికి ఆయన వయసు 82ఏళ్లు.. ఆ వయసులో కూడా పోటీకి సై అనడమే కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్వేతసౌధం నీళ్లు పడ్డాయో లేక అధికారం మీద మోజు వదల్లేదో లేక మిస్టర్ ప్రెసిడెంట్ అన్న పదానికి అలవాటుపడిపోయారో కానీ బైడెన్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

80 ఏళ్లు దాటినంత మాత్రాన పోటీ చేయకూడదని ఎక్కడా లేదు. కానీ బైడెన్ ఆరోగ్య పరిస్థితి అందుకు సహకరిస్తుందా అన్నదే అనుమానం… ఇప్పటికే ఆయన పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తన టీమ్ ను ఇబ్బంది పెడుతున్నారు. విమానం ఎక్కుతూ, నడుస్తూ పలుమార్లు తూలిపడ్డారు బైడెన్.. కొన్నిసార్లు తానేం మాట్లాడాలో కూడా మర్చిపోయారు. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పడం దాన్ని కవర్ చేయలేక ఆయన టీమ్ నానా ఇబ్బందులు పడటం అందరికీ తెలిసిందే…తన టీమ్ సభ్యులను కూడా ఆయన మర్చిపోవడం, గుర్తించలేకపోవడం జరుగుతోంది. గతంలో అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో అవే చివరి ఎన్నికలన్నట్లుగా బైడెన్ మాట్లాడారు. ఆయన తర్వాత కమలాహ్యారీస్ శ్వేతసౌధంలో అడుగుపెడతారని అంతా లెక్కలేశారు. కానీ ఇప్పుడు మాత్రం మరోసారి పోటీలో ఉండాలని బైడెన్ భావిస్తున్నారు. డెమొక్రటిక్ ప్రైమరీస్ కు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన పలు సర్వేల్లో ప్రజలు బైడెన్ పనితీరు కంటే ఆయన వయసుపైనే సందేహాలు వ్యక్తం చేశారు. రెస్ట్ తీసుకుంటేనే మంచిదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయినా అయామ్ యంగ్ అంటూ కుస్తీకి సిద్ధమవుతున్నారు బైడెన్.

బైడెన్ బరిలోకి దిగితే ఈసారి పోరు మరోసారి 2020ను తలపించే అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్,బైడెన్ మధ్య గట్టి యుద్ధమే జరిగింది. ఈసారి కూడా ఈ ఇద్దరే బరిలో నిలిస్తే అదే వేడి కొనసాగడం ఖాయం….తనకు పోటీగా ట్రంపే ఉండాలని బైడెన్ కూడా కోరుకుంటున్నట్లే కనిపిస్తోంది. కరోనా ఆ తర్వాత పరిస్థితుల కారణంగా బైడెన్ గ్రాఫ్ కాస్త తగ్గింది. దీన్ని ఆయన కూడా గుర్తించారు. అందుకే ఈసారి ఎన్నికలు తన పాలనకు రిఫరెండం కాకూడదని ఆయన భావిస్తున్నారు. అసలైన రాజకీయ నాయకుడికి, కుట్ర పూరిత మనస్తత్వం ఉన్న నాయకుడికి మధ్య పోరాటంలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వ్యవహరించిన తీరు, సృష్టించిన విధ్వంసాన్ని అమెరికన్లు ఇంకా మర్చిపోలేదు. దానిపై ఇంకా విచారణ నడుస్తోంది. దాన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.

ట్రంప్, బైడెన్ ఎవరికి వారు తామే అధ్యక్ష అభ్యర్థులమని చెప్పుకుంటున్నప్పటికీ అభ్యర్థులను తేల్చాల్సింది ఆయా పార్టీల క్రియాశీలక కార్యకర్తలే… పోటీకి సిద్ధమైన అందరి మధ్య ఓటింగ్ జరిగి చివరకు ఒకరిని తమ పార్టీ అభ్యర్థిగా వారే ఖరారు చేస్తారు. ముందు వారు ఓకే అంటేనే వీరు అభ్యర్థులు… వచ్చే ఏడాదికి గానీ ఎవరు బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు