INDIA: ఇండియా సమన్వయ కమిటీ ఏర్పాటు.. 14 మందికి చోటు.. కమిటీ సభ్యులు వీళ్లే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాల కూటమి ఇండియా ముందడుగు వేసింది. సమన్వయ కమిటీతోపాటు ప్రచార కమిటీ, సోషల్ మీడియా కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 04:37 PM IST

INDIA: ఇండియా కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాల మూడో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. కూటమిని నడిపించేందుకు 14 మందితో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాయి. ముంబైలో జరుగుతున్న కమిటీ సమావేశంలో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ భేటీకి 28 పార్టీలు హాజరు కావడం గమనార్హం.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాల కూటమి ఇండియా ముందడుగు వేసింది. సమన్వయ కమిటీతోపాటు ప్రచార కమిటీ, సోషల్ మీడియా కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల షేరింగ్‌ అనేది రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటుందని కూటమి ప్రకటించింది. వీలున్నంత త్వరగా ఈ అంశంపై ఒక అవగాహనకు వస్తామని, సీట్ల పంపకం విషయం తేల్చుకుంటామని కూటమి వెల్లడించింది. సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తామని తెలిపింది. రాబోయే ఎన్నికల కోసం ఉమ్మడిగా పబ్లిక్ ర్యాలీలు, సభలు, ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఇండియా కూటమి వివరించింది. పార్టీలో మధ్య సమస్యల్ని పరిష్కరించుకుని, సమన్వయం చేసుకుని పని చేస్తామని వెల్లడించింది. జుడేగా భారత్.. జీతేగా ఇండియా నినాదాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని, అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ నినాదాన్ని ప్రచారం చేస్తామని కూడా ఇండియా కూటమి పేర్కొంది.
సమన్వయ కమిటీ కీలకం
ఇండియా కూటమి ఇకపై తీసుకోబోయే నిర్ణయాల్లో సమన్వయ కమిటీ కీలకపాత్ర పోషించబోతుంది. ఇండియా తీసుకోబోయే అత్యుత్తమ నిర్ణయాల్ని ఈ కమిటీయే పర్యవేక్షిస్తుంది. కమిటీలోని సభ్యులు వీళ్లే, 1.కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) 2.శరద్ పవార్ (ఎన్సీపీ) 3.తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే) 4.తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) 5.అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) 6.సంజయ్ రౌత్ (శివసేన) 7.ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 8.రాఘవ్ చద్దా (ఆప్) 9.జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ) 10.లలన్ సింగ్ (జేడీయూ) 11.డి.రాజా (సీపీఐ) 12.ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) 13.మెహబూబా ముఫ్తీ (పీడీపీ). సీపీఐ నుంచి కమిటీ మెంబర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే వివిధ పార్టీలతో మిగతా గ్రూపులను కూడా కూటమి ఎంపిక చేసింది.