Canada: భారత రాయబారిపై వేటు వేసిన కెనడా.. ఇరు దేశాల మధ్య ముదిరిన వివాదం..‎?

కెనడాలోని భారత రాయబారిని బహిష్కరించింది. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలోని రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్‌మెంట్ హెడ్‌ పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్‌లోనే ప్రధాని ఈ ప్రకటన చేయడం విశేషం.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 02:32 PM IST

Canada: కెనడాలోని భారత రాయబారిపై ఆ దేశం బహిష్కరణ వేటు వేసింది. బదులుగా.. ఇండియాలోని కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. కెనడా, బ్రిటన్ సహా పలు దేశాల్లోని సిక్కులు తమకు ఇండియాలో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం కావాలంటూ కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కెనడాలోని కొన్ని సిక్కు సంఘాలు మద్దతిస్తున్నాయి. ఈ సంఘాల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఒకటి. ఈ సంస్థకు చెందిన అగ్రనేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ గత జూన్ 18న హత్యకు గురయ్యాడు.

ఈ హత్యపై కెనడా ప్రభుత్వం విచారణ జరిపింది. దీని వెనుక భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థల హస్తం ఉందని, భారతీయులే ఈ హత్యకు పాల్పడ్డారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్ సాక్షిగా ఆరోపించారు. తమ దేశంలో జరిగిన ఈ హత్య వెనుక భారతీయ సంస్థల పాత్ర ఉన్న నేపథ్యంలో, కెనడాలోని భారత రాయబారిని బహిష్కరించింది. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలోని రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్‌మెంట్ హెడ్‌ పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్‌లోనే ప్రధాని ఈ ప్రకటన చేయడం విశేషం. తమ పౌరుడి హత్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తులో విదేశీ సంస్థల్ని అంగీకరించబోమన్నారు. దీనికి భారత్ సహకరించాలని కోరారు.
భారత్ ప్రతి చర్య
కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను భారత విదేశాంగశాఖ ఖండించింది. కెనడా చర్యకు బదులుగా భారత్‌లోని ఆ దేశ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా రాయబారి కామెరూన్ మెక్ కేకు కేంద్ర విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐదురోజుల్లోగా ఇండియా విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటూ ఉండటంతోపాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాలు తమ దేశాల్లోని రాయబారులను బహిష్కరించడమంటే కీలక పరిణామంగానే భావించాలి.
ఎవరీ నిజ్జర్..?
కెనడాలోని ఖలిస్తాన్ ఉద్యమకారులకు నాయకత్వం వహించే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌తోపాటు, గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్‌కు అధిపతి హర్‌దీప్ సింగ్ నిజ్జర్. ఇండియాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ప్రోత్సాహం అందిస్తాడు. దీంతో అతడిని ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అంతేకాదు, అతడిపై రూ.10 లక్షల రివార్డ్ కూడా ఉంది. భారత్ ఎప్పటినుంచో అరెస్టు చేయాలని భావిస్తున్న అతడిని గత జూన్‌లో బ్రిటీష్ కొలంబియా సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఇరు దేశాల మధ్య వివాదానికి కారణం..?
కెనడాలోని రాజకీయ కారణాలు, ప్రధాని జస్టిన్ ట్రూడో బలహీనతలే ఇరు దేశాల మధ్య వివాదాలకు కారణం. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డగా మారుతోంది. ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇండియాలోని సిక్కులతో ఖలిస్తాన్ దేశం ఏర్పాటు చేయాలని అక్కడి సిక్కులు డిమాండ్ చేస్తుంటే.. దీనికి కెనడా ప్రభుత్వం పరోక్షంగా మద్దతిస్తోంది. కారణం.. కెనడాలో సిక్కుల సంఖ్య ఎక్కువ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనసాగాలంటే నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) మద్దతు అవసరం. ఈ పార్టీని నడిపిస్తోంది జగ్మీత్ సింగ్ ధాలివాల్. ఈ పార్టీ ఖలిస్తాన్ అనుకూల పార్టీ. అతడికి గతంలో భారత వీసాను కూడా మన ప్రభుత్వం నిరాకరించింది. అలాంటి జగ్మీత్ ఆధ్వర్యంలోని ఎన్‌డీపీ వంటి పార్టీల, ఓటర్ల మద్దతు కోసం ట్రూడో ఇలా ఇండియా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలే అసలు వివాదానికి మూలం.
కెనడాకు ఎందుకంత ప్రాధాన్యం..?
కెనడాకు, భారత్‌కు మధ్య అంత బలమైన సంబంధాలేమీ లేవు. కానీ, కెనడా సాధారణ దేశం కాదు. ఎందుకంటే జీ7 సభ్యదేశాల్లో ఒకటి. ఇది సంపన్న దేశాల కూటమి. నాటోలో కూడా కెనడాకు సభ్యత్వం ఉంది. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న దేశం కావడం వల్లే భారత్ ఈ విషయంలో ఆచితూచి స్పందించాల్సి వస్తోంది. రెండు దేశాల మధ్య ఖలిస్తాని అంశమే అసలు సమస్య.