India Canada Row: ఇండియా-కెనడా వివాదం.. కెనడా వైఖరే కారణమా..? అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా..?

గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. తమ దేశ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాదు.. భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది.

  • Written By:
  • Publish Date - October 1, 2023 / 06:54 PM IST

India Canada Row: ఇండియా-కెనడా మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఈ అంశం రెండు దేశాల మధ్యే కాదు.. అంతర్జాతీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియాపై కెనడా చేసిన ఆరోపణలు, భారతీయ దౌత్యవేత్తపై వేటు వంటివి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలెలా ఉన్నాయి.
గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. తమ దేశ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాదు.. భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. కెనడా చర్యక ప్రతిగా భారత్ కూడా.. ఇక్కడ ఉన్న సీనియర్ కెనడా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే, కెనడా చేసిన ఆరోపణలకు భారత్ ఖండించింది. తగిన ఆధారాలు లేకుండా.. భారత్‌పై నిందలు వేయడం తగదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ వంటి దేశాల మద్దతు కూడగట్టేందుకు కెనడా ప్రయత్నించింది. భారత వైఖరిని ఖండించాలని ఆయా దేశాలను కోరింది. కానీ, దీనికి ఆ దేశాల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ విషయంలో అన్ని దేశాలు తటస్థ వైఖరిని ప్రదర్శించాయి.
తీవ్రవాదులకు అడ్డాగా..?
కెనడా కొంతకాలంగా ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది. అక్కడ భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతోంది. దీనికి కెనడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. కొంతమంది సిక్కులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వారి ఓట్ల కోసం కెనడా ప్రధాని ట్రూడో వారికి మద్దతిస్తున్నారు. అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్న వారిలో చాలా మంది ఇండియాలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ విషయంపై కెనడాకు సమాచారం ఇచ్చినా.. ఎలాంటి స్పందనా లేదు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఐసిస్, ఐఎస్ఐ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయి. అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఇండియా మాత్రమే కాదు.. ఈ విషయంలో కెనడాపై బంగ్లాదేశ్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. తమ దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవారికి కెనడా ఆశ్రయం ఇస్తోందని బంగ్లాదేశ్ ఆరోపించింది. తీవ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారిందని విమర్శించింది. ఇంత జరుగుతున్నా.. ఉగ్రవాదులపై కెనడా ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ట్రూడో ఉదాసీనతే సమస్య
నిజానికి ఇండియా, కెనడా మధ్య ఉన్న సమస్యను సులభంగా పరిష్కరించే వీలుంది. భారత్ కోరినట్లు తీవ్రవాదుల విషయంలో, ఖలిస్తాన్ ఉద్యమం విషయంలో కెనడా సరిగ్గా స్పందిస్తే చాలు. కానీ, వారి విషయంలో ట్రూడో అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే ఈ పరిస్థితికి కారణం. తమ దేశంపై ఇండియా, బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయంగా పరువుపోతున్నా సరైన స్పందన లేదు. దీంతో ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. భారత్ వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఒక దేశానికి వ్యతిరేకంగా తమ దేశంలో ఉద్యమం జరిగేలా ప్రోత్సహించడం సరైంది కాదు. ఈ విషయం తెలియని అమాయకుడిలా ట్రూడో నటిస్తున్నాడు. తమ దేశ పౌరుడి హత్య అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ, అక్కడే గతంలో జరిగిన ఇతర హత్యల విషయంలో మాత్రం స్పందించలేదు.
గట్టి బదులిచ్చిన భారత్
కెనడా వైఖరిపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ గట్టి బదులిచ్చారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన జైశంకర్‌.. అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో కెనడాకు సవాల్ విసిరారు. భారత్‌పై అనవసర, నిరాధార ఆరోపణలు చేయడం కాకుండా.. నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందని నిరూపించేలా తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల విషయంలో కెనడా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడమే ఇరు దేశాలమధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణమని ఆరోపించారు. ఇండియాపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే, వాటిని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో భారత్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. కెనడాలో ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలు, ఉగ్రవాదం విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న వైఖరి కారణంగా భారత్‌ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. వాక్ స్వేచ్ఛ పేరుతో దౌత్యవేత్తల్ని బెదిరిస్తే.. చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు. కెనడాలో భారత దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగాయని, ఇండియన్ ఉద్యోగులను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని మీడియాకు వివరించారు.
అమెరికా డబుల్ గేమ్
కెనడా మిత్ర దేశమైన అమెరికా ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు కెనడాకు తాము అండగా ఉంటామని చెబుతూనే.. ఇండియాతో మాత్రం ఈ ప్రస్తావనే తేవడం లేదు. ఈ విషయంలో ఇండియాపై నేరుగా ఒత్తిడి తేవడంగానీ, చర్చించడం, జోక్యం చేసుకోవడం చేయడం లేదు. కానీ, కెనడాకు మాత్రం సహకరిస్తోంది. దీంతో అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ అర్థమవుతోంది. ఇరు దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాల రీత్యా.. ఆ దేశం బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయడం లేదు.