Pawan Kalyan: ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ధైర్యం నింపారని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. కీలక అంశాలపై మాట్లాడారు. “ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం కాదు. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
PM Modi: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ
భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ. విజన్ 2047 లో భాగంగా ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశం కావాలంటే.. మూడోసారి మోదీ సర్కార్ రావాలి. ప్రధాని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు చేసేవారు కాదు. రామమందిరం నిర్మించే వారు కాదు. ప్రధానిగా మోదీ వచ్చాక ఉగ్ర దాడులను ఏ విధంగా కట్టడి చేశారో మీకు తెలుసు. మా దేశం మీద దాడులు చేస్తే మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని ధైర్యంగా చెప్పి ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన లీడర్ మోదీ. మోదీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలి. బీసీలు తెలంగాణలో ఎదగాలి. ముఖ్యమంత్రి కావాలి. దీనికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో విజయం సాధించాం. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అందరికీ చేరాయా అన్నది ప్రశ్నగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటుంది. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల్ యోజన, గరీబ్ కల్యాణ్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది.