PM MODI: అవిశ్వాసం పెట్టి ఏం సాధించారు..? రాబోయేది మా ప్రభుత్వమే..! ప్రతిపక్షాలకు మోదీ కౌంటర్

మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 08:43 PM IST

PM MODI: సుపరిపాలన అన్నదానికి తమ పార్టీ నిదర్శనంగా నిలుస్తోందని, తన తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా చూపించగలారా అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు అవిశ్వాసం తీసుకొచ్చాయి. 2018లోనూ మాపై అవిశ్వాసం పెట్టారు. ప్రతిసారి మాపై ప్రజలు విశ్వాసం ఉంచారు. ఈ విషయంలో భారతీయులకు ధన్యవాదాలు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ప్రతిపక్షాలు నోబాల్స్ వేస్తుంటే.. మేం ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నాం.

రాబోయేది మా ప్రభుత్వమే

ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. ఇటీవల మా ప్రభుత్వం కీలక బిల్లులు సభలో ఆమోదించింది. ఇలాంటి బిల్లులపై ప్రతిపక్షాలకు ఆసక్తి లేదు. ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది. దేశాన్ని ప్రతిపక్షాలు ఇప్పటిదాకా నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదు. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతున్నారు. 1999లో శరద్ పవార్ నాయకత్వంలో, 2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు. 2018లో మళ్లీ అవిశ్వాసం పెట్టారు. ఇన్ని అవిశ్వాసాలతో ఏం సాధించారు? అవిశ్వాసాలు ఎందుకు పెడుతున్నారు.. అసలు మీ సమస్యేంటి? ఈ శాతాబ్దం ఇండియాది. భారత స్వప్నాలు సాకారమయ్యే కీలక శతాబ్దమిది. దేశ ప్రజల కలలు నెరవేరుతున్నాయి. ఇలాంటి సమయంలో మనందరి సంకల్పం అభివృద్ధి ఒకటే కావాలి. ఆకాశం అంచులు దాటి ఆలోచిస్తున్న యువతకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశం ఎంత బలంగా ఉందనడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం. ఇండియాలో నిరుపేదలు, అతిపేదలు లేరని ఐఎంఎఫ్ పేర్కొంది. దేశంలో 37 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పింది. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోంది. కానీ, ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం అభివృద్ధి కనబడట్లేదు. వారి కళ్లు అహంకారంతో మూసుకుపోయాయి. మోదీకి సమాధి కట్టేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఎదుటి వాళ్ల నష్టం కోరుకునే వరం లభించినట్లుంది. కానీ మీరు ఎంత నష్టం కోరుకుంటే మాకు అంత లాభం కలుగుతుంది. కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే స్థాయి లేదు. ఆర్థిక వ్యవస్థపై, దేశంపై దిశదశ లేదు. ప్రతిదాన్ని విమర్శించడం తప్ప ఆలోచన విధానం లేదు. ఏపీ, బెంగాల్‌లో ఒక్క శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్‌కు లేరు. యూపీఏ అనేది ముగిసిన అధ్యాయం. మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల అపరాధం కాదు.
ప్రతిపక్షాలు ఏకమైనా ఓటమి తప్పదు
NDAకు రెండు I (ఐ)లు అదనంగా చేర్చి INDIA పేరుతో మళ్లీ కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రతిపక్షాలు ఎన్ని కొత్త జట్లు కట్టినా ఓటమి ఖాయం. వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు దేశంలో కాలం చెల్లింది. కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది. ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించింది. మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ వంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. లంకను తగులబెట్టింది హనుమంతుడు కాదు.. లంకేయుల అహంకారం. ఆ విషయం కాంగ్రెస్‌కు నూటికి నూరు శాతం సరిపోతుంది. 400 సీట్ల నుంచి 40 సీట్లకు వచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. రాజకుమారుడు కారు అద్దం దించి దేశంలో సమస్యలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. ప్రజల కష్టాలు, నష్టాలు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దేశాన్ని 50 ఏళ్లు పాలించింది ఆ రాజవంశమే అన్న స్పృహ ఆయనకు ఇంకా వచ్చినట్లు లేదు. INDIA దుకాణానికి కూడా త్వరలో తాళం పడుతుంది.
మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది
మణిపుర్‌పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన ప్రతిపక్షాలకు లేదు. మణిపుర్‌లో ఏం జరిగిందో నిన్న అమిత్ షా వివరంగా చెప్పారు. మణిపుర్‌లో శాంతి నెలకొంటుందని సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నా. ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపుర్ ప్రజలకు అండగా నిలుస్తుంది. అధికారం లేకుండా విపక్షాలు జీవించలేవు. భారతమాత మరణం గురించి మాట్లాడటమంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లే. ఒకసారి భారతమాత హత్య అంటారు. మరోసారి రాజ్యాంగ హత్య అంటారు. ఎలాంటి భాష ఇది? ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సంస్కారం కాదు. ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజన చేశారు. కాంగ్రెస్ చరిత్ర అంతా భారతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయింది. కాంగ్రెస్ అరాచకాలు చెప్పుకుంటే అనేకం.. మిజోరాం మీద జరిగిన వాయుసేన దాడి మర్చిపోయినట్లున్నారు. ఇందిరాగాంధీ హయాంలో మిజోరాంపై జరిగిన వాయుసేన దాడిని కాంగ్రెస్ ఇప్పటిదాకా దాచిపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ఎప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసిందా..?” అంటూ ప్రధాని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.