INDIA Vs BHARATH: మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇండియా పేరు మార్పు నేపథ్యంలో పేర్లపై చర్చ మొదలైంది..? ఇండియాతోపాటు మన దేశానికి భారత్ అనే పేరు ఎందుకుంది..? హిందుస్తాన్ అనే పేరు సంగతేంటి..? ఈ విషయంలో చరిత్ర ఏం చెబుతోంది..?
భారత రాజ్యంగంలోని అధికరణ 1లోనే ఇండియాతోపాటు భారత్ అనే పేరు కూడా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో, ఇండియన్ రైల్వేస్‌లో కూడా భారతీయ అనే పదం వాడుతారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ రైల్వే అనే పదాలు వాడుకలో ఉన్నాయి. అందువల్ల రాజ్యాంగం ఇండియా, భారత్.. రెండింటికీ అనుమతించింది.
ఇండియా పేరు విషయంలో ఉన్న వివాదం ఇప్పటిది కాదు. చాలా కాలంగా ఇండియా అనే పేరుపై కొందరికి అభ్యంతరాలున్నాయి. దీనిపై 2020లో సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలైంది. బ్రిటీష్ కొలోనియల్ కాలనీకి చెందిన ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని, దాని బదులు భారత్ అనే పదాన్ని వాడాలని పిల్ దాఖలైంది. అయితే, దీన్ని కోర్టు కొట్టివేసింది. ఇండియా, భారత్.. రెండింట్లో ఎవరికి, ఏది కావాలంటే అది పిలవొచ్చని సూచించింది.
భారత్ ఎక్కడి నుంచి..?
భారత్, భారత, భారత వర్ష అనే పదాలు పురాణకాలం నుంచి ఉన్నాయి. భారతీయ పౌరాణికాల్లో ప్రముఖమైన మహాభారత నుంచి ఈ పదాలు వచ్చినట్లుగా చెబుతారు. ఉత్తరాన మంచు పర్వతాలకు, దక్షిణాన సముద్రానికి మధ్య ఉన్న భూభాగాన్ని భారత్‌గా పేర్కొన్నారు. కొందరు చరిత్రకారుల ప్రకారం.. భారత్ అనే పదం మతపరమైనదే అని, సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉంది. అంతేకానీ.. దీనికి ఎలాంటి రాజకీయ, భౌగోళిక నేపథ్యం లేదు. ఇండస్ వ్యాలీ (సింధు లోయ) నుంచి హిందూ అనే పదం కూడా పుట్టింది.దీన్నుంచే ఇండస్, ఇండోస్ అనే పదాలు ఉద్భవించాయి. అవి ఇండియాగా మారాయి. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఇండియా అనే పిలిచే వాళ్లు. రాజ్యాంగంలో మాత్రం ఇండియా, భారత్ అనే రెండు పేర్లను పిలవొచ్చు అని స్పష్టం చేసి ఉంది.
పేరు మార్చడం సాధ్యమేనా..?
1947లోనే దేశానికి ఏ పేరు పెట్టాలన్న చర్చ జరిగింది. అప్పట్లో రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సందర్భంగా హెచ్వీ కామత్ ఈ అంశంపై చర్చించారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలపై అభ్యంతరం చెప్పారు. అప్పట్లో దేశానికి ఇండియా దటీజ్ భారత్ అనే పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అప్ట్పట్లో ఇండియాతో పాటు భారత్ అనే పేరు కూడా పెట్టారు. కేంద్రం ఇండియా పేరును భారత్‌గా మార్చాలనుకుంటున్నట్లు స్పష్టమైంది. దీనికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాలి. కొన్ని రాజ్యాంగ సవరణలకు 50 శాతం సభ్యుల మద్దతు అవసరం.
అయితే, ఇలాంటి వాటి సవరణకు 66 శాతం సభ్యుల మద్దతు అవసరం. అంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. ప్రభుత్వం ఈ మెజారిటీ సాధించగలిగితే ఇండియా పేరు తొలగించి, ఒక్క భారత్ పేరునే కేంద్రం ఖరారు చేస్తుంది. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే, జమిలి ఎన్నికలతోపాటు, ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.