Telangana Politics: టీ కాంగ్రెస్‌, కమలంలో కొత్త కుంపట్లు

కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని పూర్తిగా ఓట్లుగా మార్చుకోలేకపోతోంది. నేతలు తమలో తాము కొట్టుకుంటున్నారు. ఇక బీజేపీ ఈ మధ్య కాస్త బలం పుంజుకుంది అనుకుంటే దానిలోనూ లుకలుకలు మొదలయ్యాయి.

  • Written By:
  • Updated On - March 15, 2023 / 10:01 AM IST

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ పార్టీల్లో లుకలుకలు మొదలయ్యాయి… తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు కొట్టుకోవడం కామనే… అయితే ఇప్పుడు ఈ సంస్కృతి బీజేపీకి కూడా పాకింది. ఇంతకీ వీరు కేసీఆర్‌తో కొట్లాడతారా లేక తమ పార్టీలో నేతలపై కొట్లాడాలా…? ఈ లుకలుకలు కేసీఆర్‌కు ప్లస్ కాబోతున్నాయా…?

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య సఖ్యత లేదన్నది అందరికీ తెలిసిందే. సీనియర్లు ఒక్కొక్కరిదీ ఒక్కో దారి… ఎవరికి వారే యమునా తీరే…. పాత వివాదాలు పక్కన పెడితే ఇప్పుడు పాదయాత్రల కుంపటి మొదలైంది. ఇప్పుడు సీనియర్ నేత మహేశ్వర్‌రెడ్డి వంతు వచ్చింది. ఆయన పాదయాత్రకు అనుమతిచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్ థాక్రే ఇప్పుడు ఆ యాత్రను ఆపేయమనడం వివాదం రగిల్చింది. సీనియర్లు అందరూ పాదయాత్రలు చేయాలన్న ఠాక్రే… మహేశ్వర్‌రెడ్డి యాత్రను ఆపడం వెనక పీసీసీ చీఫ్‌ ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డికి, మహేశ్వర్‌రెడ్డికి మధ్య గొడవలున్నాయన్నది గాంధీభవన్ వర్గాల కథనం. అందుకే ఆయనే దీన్ని అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఏకంగా థాక్రేకు లేఖ రాశారు మహేశ్వరరెడ్డి. పాదయాత్ర ఆపమని సూచించడం వెనక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌నే వివరణ ఇవ్వాలని ఓ నేత కోరడం కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యమేమో…

ఇప్పటికే రేవంత్‌రెడ్డి పెద్దరెడ్లు కేసీఆర్‌కు అమ్ముడు పోయారని కామెంట్ చేసారన్న వివాదం నడుస్తోంది. దీనిపై హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై రేవంత్‌రెడ్డి వర్గం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. మరోవైపు దామోదర రాజనర్సింహ అలకబూనారు… ఆయన ఢిల్లీ బాట పట్టారు. ధరణి వివాదంలో పార్టీ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అయితే చాలామంది సీనియర్లు ఆయనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఓ వివాదం సమసిపోయిందనుకునేలోగానే కాంగ్రెస్‌లో మరో సమస్య వచ్చి పడుతోంది. ఎవరు ఎవరిపై రాజకీయం చేస్తున్నారో ఎవరు ఎవరికి ఎర్త్ పెడుతున్నారో కాంగ్రెస్ నేతలకే అర్థం కావడం లేదు.

బీజేపీలోనూ సేమ్ సీన్. కవితపై చేసిన కామెంట్లను అడ్డం పెట్టుకుని బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు పార్టీలోని ఆయన వ్యతిరేకులు… ఎంపీ అర్వింద్ నేరుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై మీడియా సాక్షిగా హాట్ కామెంట్లు చేశారు. అధ్యక్షుడంటే పవర్ సెంటర్ కాదని కోఆర్డినేట్ వ్యవస్థ మాత్రమే అని తేల్చిచెప్పారు. ఆయనకు మరికొందరు తోడయ్యారు. సీనియర్‌ నేత పేరాల శేఖరరావు అయితే ఓ అడుగు ముందుకేసి బండి సంజయ్‌ను ఓ రేంజ్‌లో ఎండగట్టారు. అధ్యక్షుడి పరిణితి లేని అసందర్భ ప్రేలాపనలు పార్టీని దెబ్బతీస్తున్నాయన్నారు. నమ్ముకున్న కార్యకర్తలను దూరంగా పెట్టడం, యూజ్ అండ్ త్రో సంస్కృతి బీజేపీది కాదన్నారు. బండి సంజయ్ ఈ విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు గుప్పించారు పేరాల. ధర్మపురి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కన్నం అంజయ్య కూడా బండి సంజయ్‌ నాయకత్వంలో న్యాయం జరగడం లేదంటూ ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే కాస్త క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెబుతారు. అలాంటి కమలంలో కుంపట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. పైగా అమిత్‌షా క్లాసు పీకి రెండ్రోజులు కూడా కాకముందే రచ్చ రోడ్డుకెక్కింది.

ప్రస్తుతం బీఆర్ఎస్‌ పార్టీ కాస్త అయోమయంలో ఉంది. లిక్కర్‌ స్కామ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె చిక్కుకోవడం ఆ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో అర్థం కావడం లేదు. కక్ష సాధింపుగా భావిస్తారా లేక కవిత నిజంగానే తప్పుచేసిందని అనుకుంటారా అన్నది తెలియట్లేదు. ఈ సమయంలో దాన్ని రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఉపయోగించుకోవాల్సి ఉంది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని తమవైపు తిప్పుకోవడానికి ఇదో అవకాశం. ఈ కీలక సమయంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లో కుంపట్లు రగులుకున్నాయి. లిక్కర్‌స్కామ్‌పై ఆ పార్టీలు మాట్లాడటం లేదా అంటే లేదని కాదు. రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే సిన్సియర్‌గా జరగడం లేదు.

ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉంది. మిగిలిన పార్టీలతో పోల్చితే బీఆర్ఎస్ చాలా ముందుందన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని పూర్తిగా ఓట్లుగా మార్చుకోలేకపోతోంది. నేతలు తమలో తాము కొట్టుకుంటున్నారు. ఇక బీజేపీ ఈ మధ్య కాస్త బలం పుంజుకుంది అనుకుంటే దానిలోనూ లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ హైకమాండ్ మెచ్చిన రాష్ట్ర అధ్యక్షుడిపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు నేతలు. మొత్తంగా చూస్తే ఈ కుమ్ములాటలు అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్‌కు వరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(KK)