రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. భూముల అక్రమాలపై సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. వందల కోట్లు విలువ చేసే…42 ఎకరాల భూమిని ఎవరి ప్రొద్బలంతో కేటాయించారో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ లీలలు…ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో…ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. భూదాన్ భూముల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. భూదాన్ భూముల కేటాయింపులపై ఈడీ రంగంలోకి దిగింది. వందల కోట్ల విలువైన 42 ఎకరాల భూదాన్ భూములు ఎలా అక్రమంగా బదిలీ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తొలి రోజు 8గంటల పాటు విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు…రెండో రోజు కూడా వివిధ కోణాల్లో అమోయ్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అబ్దుల్లాపూర్మెట్ సర్వే నంబర్ 17లో రైతుల భూమి ఎలా బలవంతంగా లాక్కున్నారు ? రైతులకు చెందిన 45 ఎకరాల భూమిలో…26 ఎకరాలు భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా బదిలీ చేశారు ? ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తుల ఒత్తిడితోనే భూములను బదిలీ చేశారా ? లేదంటే రాజకీయ నేతలతో పాటు సబార్డినేట్లు ఎవరైనా ఒత్తిడితోనే భూములను బదిలీ చేశారా ? అంటూ ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ లో సీలింగ్ ల్యాండ్ పట్టా భూమి ఎలా బదిలీ చేశారు ? భూములను బదిలీ చేసినందుకు ముడుపులు ఏమైనా ముట్టాయా ? విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ ఆధారంగా అమోయ్ కుమార్ అక్రమాలపై ఈడి విచారించింది. భూములు ఏ విధంగా బదిలీ చేశారు ? ఎవరెవరికి బదిలీ చేశారు ? ఎవరి ఒత్తిడితో ఈ వ్యవహారం కొనసాగింది ? భూ అక్రమాల వ్యవహారంలో తహసిల్దార్, ఆర్డీవో, ధరణి ఆపరేటర్, సిస్టం ఆపరేటర్ల ప్రమేయం ఇతర సిబ్బంది జోక్యం వాటి విషయాలను అమోయ్ కుమార్ ను ప్రశ్నించింది ఈడి. నానక్ రామ్ గూడా ప్రభుత్వ భూమి 5 ఎకరాల స్థలం… రెగ్యులరైసేషన్లో అక్రమాలు ఎలా జరిగాయని ఆరా తీసిన ఈడీ…అమోయ్ కుమార్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది.
నాగారంలో వందల కోట్ల విలువైన 42ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేశారంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. గతంలోనే భూదాన్ భూముల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. తాజాగా అక్రమాలపై నిజానిజాలను తేల్చేందుకు ఈడీ విచారణ జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా ఆ సమయంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ను విచారణకు రావాలని ఈడీ 4 రోజుల క్రితం నోటీసులు జారీచేసింది. తొలి రోజు 8గంటలకుపైగా విచారణ జరిపిన ఈడీ…రెండో రోజు కూడా అమోయ్ కుమార్ ను సుదీర్ఘంగా ప్రశ్నించింది.
మరోవైపు గరంలో నానాటికీ భూముల ధరలు భారీగా పెరగుతుండటంతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఎవరైనా సర్కారు భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. నవంబరు నుంచి భూముల కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఉన్న భూముల బహిరంగ ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధ్యయనం చేసింది. ఈ మేరకు భూముల మార్కెట్ విలువను సవరించే ప్రక్రియను దాదాపు పూర్తిచేసింది. ఈ సందర్భంగా త్వరలోనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నివేదిక అందించనుంది. అనంతరం కొత్త మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో అమలవుతున్న ధరలు దాదాపు కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం.