వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలంగాణలో ఉండి సహకరించిన ఎవరైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురికావాల్సిందేనా…? అది సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైన ఎవరి విషయంలోనైనా జగన్ కు సహకరిస్తే ఖచ్చితంగా రేవంత్ రివెంజ్ తీర్చుకుంటారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వైఎస్ జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన ఎవరికైనా సరే దూల తీరిపోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఈ కోణంలోనే భావించవచ్చు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎవరు ఎక్కడ దొరుకుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాచుకొని కూర్చున్నారని, అల్లు అర్జున్ దొరకడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారని ఒపీనియన్స్ వినపడుతున్నాయి. గత ఏడాది కాలంగా ఇదే జరుగుతుందని కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా స్టార్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ సినిమా నటుడు కాకపోయి ఉంటే రేవంత్ రివెంజ్ వ్యవహారం బయటకు వచ్చేది కాదు అనే అభిప్రాయం సినీ పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.
రెండు నెలల క్రితం అక్కినేని నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్… భూమి వివాదం విషయంలో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. ఇక తాను అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను అడ్డం పెట్టుకొని నాగార్జున విషయంలో రివెంజ్ తీర్చుకున్నారు రేవంత్ రెడ్డి. నాగార్జునకు వైయస్ జగన్ కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దీనితోనే ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదని అంటారు.
ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో సినిమా హాల్ దగ్గర జరిగిన ఘటనలో ఒక మహిళ చనిపోవడం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. సాధారణంగా ఇటువంటి ఘటనలో సినిమా నటులు పై కేసులు పెట్టి వదిలేస్తారు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఇది ఎవరూ ఊహించలేదు అసలు. దీని వెనక కారణం అల్లు అర్జున్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి సహకరించడం. అలాగే వైసిపి వాళ్ళు అల్లు అర్జున్ విషయంలో సానుకూలంగా వ్యవహరించడం పై రేవంత్ సీరియస్ గా ఉన్నారట.
సినిమా వాళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి అంత దూకుడు స్వభావం ఏమీ చూపించడం లేదు. కేవలం జగన్ కు సహకరించే వారిపై మాత్రమే ఈ దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే అభిప్రాయం వినపడుతోంది. అయితే జగన్ విషయంలో రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా ఉండడానికి ప్రధాన కారణం వేరే ఉందని అంటారు. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి వైయస్ జగన్ ఆర్థిక సహాయం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించడానికి అలాగే అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష కూటమి ఓటమిపాలు కావడానికి జగన్ కూడా పరోక్ష కారణమనే అభిప్రాయం రేవంత్ లో బలంగా ఉంది.
2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ అధిష్టానానికి బాగా దగ్గరైన రేవంత్ ను… కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎదుగుతున్న రేవంత్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి సీఎం కేసీఆర్ అలాగే హైదరాబాదులో ఉన్న జగన్ రెడ్డికి సహకరించే కొంతమంది తీవ్రంగా సహకరించారని రేవంత్ నమ్ముతారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన సేకరించారు. రేవంత్ రెడ్డిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రధాన వ్యాపారంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
అప్పుడు గులాబీ పార్టీకి వ్యూహానికి వైయస్ జగన్ కూడా అండదండలు అందించారు. ఒకానొక దశలో రేవంత్ ను అన్ని విధాలుగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడంతో… రేవంత్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇదే టైంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రేవంత్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. కర్ణాటక నుండి రేవంత్ కు నిధులు కూడా అందాయని చెపుతారు. దీనితో రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటూ వచ్చారు. ఇదే టైంలో విడివిడిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకు తీసుకు వచ్చేశారు.
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి తనను వ్యతిరేకించే వారితో కూడా రేవంత్ రెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారు. వారందరినీ దూరం చేసుకోవడం కంటే దగ్గర చేసుకోవడమే మేలు అని భావించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్దలను, సీనియర్లను దగ్గర చేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా తనకు ఉన్న స్పష్టతను వారికి వివరించారు. ఈసారి అధికారంలోకి రాకపోతే కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పెడతాడని, ఆర్థికంగా పూర్తిగా పతనం అయిపోతామని రాజకీయ భవిష్యత్తు ఉండదని వారికి అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి హితబోధ కూడా చేశారట.
ఇదే సమయంలో వారికి రేవంత్ రెడ్డి నుంచి ఎన్నికలకు ఆర్థిక సహాయం కూడా అందినట్టుగా చెబుతూ ఉంటారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ లో గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంపీ పదవీకి రాజీనామా చేసిన తర్వాత ఎంపీలకు రేవంత్ రెడ్డి విందు ఇచ్చారు. ఈ విందుకి కొందరు వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారట అప్పట్లో. వారికి జగన్ ఎంపీ సీట్లు ఇవ్వలేదు అనే విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీనితో అందరూ కంగుతిన్నారు.
మర్యాదపూర్వకంగా అది కూడా ఎంపీగా ఉండి సీఎం అయిన రేవంత్ రెడ్డి అభినందించడానికి వెళ్లినా కూడా జగన్ వ్యక్తిగతంగా తీసుకుని తన శత్రువు ఇచ్చిన విందుకు మీరు వెళతారా…? అంటూ వారికి టికెట్లు ఇవ్వలేదట. అంతలా రేవంత్ రెడ్డికి జగన్ కు మధ్య వైరం ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వారు ఎవరైనా సరే కేసులు పెట్టాలి అనుకుంటే కచ్చితంగా పెట్టి తీరతారు. ఈ విషయంలో జగన్ ప్రత్యక్ష, పరోక్ష ఉదాహరణ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాళ్లు చట్టబద్ధంగా దొరికేవరకు ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న నాగార్జున చట్టబద్ధంగా దొరికేవరకు రేవంత్ రెడ్డి ఎదురు చూసి దెబ్బ కొట్టారు. భవిష్యత్తులో జగన్ కు సహకరించే వారు ఎవరైనా సరే హైదరాబాదులో గాని తెలంగాణలో గాని ఇబ్బంది పడటం ఖాయం అనే సంకేతాలు ఇచ్చినట్టుగానే కనపడుతుంది అనే అభిప్రాయం పొలిటికల్ అనలిస్ట్ లు బయటపెడుతున్నారు. ఇదే టైం లో రేవంత్ ను తక్కువ అంచనా వేయడం కూడా టాలీవుడ్ కొంప ముంచింది. రేవంత్ ఇగో పై టాలీవుడ్ గట్టి దెబ్బే కొట్టింది. అందుకే ఆయన పర్సనల్ గా తీసుకున్నారట.