Bandi Sanjay : అధ్యక్ష పదవి ఇస్తారు -ఎంపీ సీటు డౌటే !

ఫైర్ బ్రాండ్‌ లీడర్‌ బండి సంజయ్ కి ఇప్పుడు సీటు భయం పట్టుకుందా..? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి.. సిట్టింగ్‌ ఎంపీనైన తనకు తిరిగి టిక్కెట్‌ ఇస్తారో లేదోనన్న అనుమానం పెరిగిందా? తన నియోజకవర్గం మీద.. మరో సీనియర్‌ లీడర్‌ కన్నేసినట్టు ఉప్పందిందా? అందుకే స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌కు సిద్ధమయ్యారా? ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేలా ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారా?

ఫైర్ బ్రాండ్‌ లీడర్‌ బండి సంజయ్ కి ఇప్పుడు సీటు భయం పట్టుకుందా..? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి.. సిట్టింగ్‌ ఎంపీనైన తనకు తిరిగి టిక్కెట్‌ ఇస్తారో లేదోనన్న అనుమానం పెరిగిందా? తన నియోజకవర్గం మీద.. మరో సీనియర్‌ లీడర్‌ కన్నేసినట్టు ఉప్పందిందా? అందుకే స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌కు సిద్ధమయ్యారా? ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేలా ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారా?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాలు వచ్చి వారం కూడా గడవక ముందే అసలు వాటితో సంబంధమే లేదన్నట్టుగా లోక్‌సభ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్స్ మొదలు పెట్టేశారట. అయితే ఇంత ముందుగా.. అదీ హడావిడిగా ఆయన ఎందకు సీన్‌లోకి దిగారన్న చర్చ కరీంనగర్‌ పొలిటికల్‌ సర్కిల్స్ లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు. కనీసం రెండు సీట్లు గెలుస్తామని భావించిన కమలనాథులకు నిరాశే ఎదురైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన హుజురాబాద్‌లోనూ.. ఓటమే మిగిలింది.. బండి పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ సీటులో హోరాహోరీగా పోరాడినా స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికలు బీజేపీలో అనేక కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయట. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని అన్ని స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటుకు డిమాండ్‌ పెరిగిందట. ఇక్కడ నుంచి తిరిగి పోటీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమవుతుండగా.. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా టిక్కెట్‌ కోసం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సంజయ్‌ అలర్టయినట్టు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీలోని కొందరు తనను ఓడించడానికి కుట్రలు చేశారని ఆరోపించిన సంజయ్‌.. అదే దూకుడును ప్రదర్శిస్తూ… క్యాడర్‌లోకి కూడా ఆ విషయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారట.. అందులో భాగంగానే పార్లమెంట్ స్థానం పరిధిలోని బూత్ స్థాయి నేతలను ఎన్నికలకు సిద్దం చేసే పని మొదలుపెట్టారట. 45 రోజుల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేసేలా.. ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అయితే.. ఈ ప్లాన్‌ మీదే.. కరీంనగర్ బీజేపీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.. పార్టీలో తనకు పోటీగా వస్తున్న వారికి ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా ముందే హెచ్చరించాలనుకున్నారా? అన్న సందేహాలు ఎక్కువగా వస్తున్నాయట కేడర్‌కు. తనకు ఎదురు రావాలనుకుంటున్న నాయకుల్ని డిఫెన్స్ లో పడేయడమే బండి సంజయ్ అజెండాగా చెబుతున్నారు.. ఆయనకు అత్యంత సన్నిహితులు. ఆ క్రమంలో కేడర్‌ మొత్తం తనవైపే ఉండేలా సిద్ధం చేసుకునే యాక్షన్‌ ప్లానే ఈ ప్రిపరేషన్‌ మీటింగ్స్ గా చెబుతున్నారు. ఈ చర్చంతా ఓ వైపు సాగుతుండగా.. బండి ప్లాన్ వెనక వేరే కారణాలు ఉన్నాయనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. జనవరి నెలాఖరుకు సంజయ్‌కి తిరిగి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్టు పార్టీలోని ఓ వర్గం నమ్ముతోంది. సంజయ్ సన్నిహితులు కూడా ఈ వార్తలను కొట్టివేడం లేదట. ఒకవేళ అధ్యక్ష పదవి ఇచ్చినా.. కరీంనగర్ పార్లమెంట్ టిక్కెట్‌ ఇచ్చే షరతుపైనే పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారట సంజయ్. అదే జరిగితే రాష్ట్ర స్థాయిలో ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. ఇప్పటి నుంచే కరీంనగర్ క్యాడర్‌లో కదలిక తెస్తే.. ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చనే వ్యూహంలో భాగమే ఈ ముందస్తు సన్నాహకాలు అనే టాక్ కూడా వినిపిస్తోంది. బండికి తిరిగి పార్టీ పగ్గాలు ఇస్తారా? ఈటల కరీంనగర్‌ ఎంపీ రేస్‌లోకి వస్తారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.