Congress Promises: అప్పుల్లో తెలంగాణ.. కాంగ్రెస్ హామీల అమలు సాధ్యమేనా..?

ఖమ్మంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా కర్ణాటక తరహా పథకాల్ని అమలు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పింది. కానీ, తెలంగాణలో వీటి అమలు సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 04:04 PM IST

Congress Promises: అధికారమే లక్ష‌్యంగా కాంగ్రెస్ ప్రజలకు వరాలు కురిపిస్తోంది. కర్ణాటక మోడల్‌ను అమలు చేయాలనుకుంటోంది. కొన్నింటిలో అక్కడికంటే మెరుగైన పథకాల్ని ప్రకటించింది. అయితే, అప్పుల్లో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు సాధ్యమేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఖమ్మంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా కర్ణాటక తరహా పథకాల్ని అమలు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పింది. దాదాపు అన్నీ ఉచిత పథకాలే. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ నెలకు రూ.4 వేలు అందజేస్తామని ప్రకటించారు. వీటితోపటు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. ఇక కర్ణాటక తరహాలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి అమలు చేసే అవకాశం ఉంది. కానీ, తెలంగాణలో వీటి అమలు సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం తెలంగాణ అధిక అప్పుల్లో ఉండటమే.
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి రావడంతో మహిళలంతా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో మహిళల సంఖ్య పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. కర్ణాటకలో బస్సుల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. దీనివల్ల ఆర్టీసీ సిబ్బందితోపాటు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆటోలు, జీపులు, బైక్ ట్యాక్సీలకు గిరాకీ లేక వాటినే నమ్ముకున్న డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలు అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఉచిత విద్యుత్ పథకం వల్ల చాలా మంది కరెంటు బిల్లు కట్టడమే మానేశారు. ఇలాంటివి తెలంగాణలో అమలు చేస్తే ఆర్థికపరంగా చిక్కులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు.
ఆర్థిక భారం అవుతాయా?
ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, దీనికి కారణం కేసీఆర్ విధానాలే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించారు. అంటే ఇప్పటికే విద్యుత్ డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి. అలాంటిది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తే మరింతగా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు టీఎస్ ఆర్టీసీ కూడా నష్టాల బాటలోనే ఉంది. దీన్ని అధిగమించేందుకు కొరియర్ వంటి సర్వీసుల్ని ప్రారంభించింది. ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్టీసీ నష్టాల్లోంచి బయటపడటం లేదు. సిబ్బంది కూడా వేతనాల విషయంలో అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ మరిన్ని నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో ఈ పథకం అమలు సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

నిరుద్యోగ భృతిని కేసీఆర్ ప్రభుత్వమే అమలు చేయలేకపోతోంది. మరి కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుంది..? దీనికి నిధులు ఎలా సమకూర్చుకుంటుుందో చూడాలి. రూ.4,000 పింఛన్ కూడా కష్టసాధ్యమైన పనే. వీటితోపాటు వ్యవసాయ రుణ మాఫీ కూడా భారంగానే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటన్నింటినీ నిధులు ఎలా సమకూర్చుకుంటుంది..? ఈ పథకాల్ని ఎలా అమలు చేస్తుంది అనేది ప్రధాన సమస్య. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే సమస్య లేదు. కానీ, అటు అప్పుల భారం.. ఇటు పథకాల అమలు మధ్య సమన్వయం చేసుకోవడం చాలా అవసరం. లేదంటే పథకాల అమలులో తిప్పలు తప్పవు. ఇప్పటికే ప్రకటించిన పథకాల అమలే కష్టంగా ఉంటే.. భవిష్యత్తులో ప్రకటించబోయే పథకాల అమలు ఇంకెంత భారంగా ఉంటుందో చూడాలి.