CM Jagan: జగన్‌కు చెప్పేవారే లేరా..?

జగన్‌కు చెప్పేవారే లేరా లేక ఎవరు చెప్పినా వినరా..? వైసీపీ నేతలను కూడా తొలిచేస్తున్న ప్రశ్న ఇది. రాజకీయ విషయాల్లో అంటే ఓకే కానీ చివరకు దేవుడి విషయంలోనూ అదే నిర్లక్ష్యమా..? అదే మొండితనమా..? దేవుడు కూడా నా కంట్రోల్‌లోనే ఉండాలన్నది సరైనదేనా..? టీటీడీ పాలకమండలి నియామకం మరోసారి వివాదాస్పదమైంది.

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 05:57 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి.. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వేంకటేశ్వర స్వామి సేవలో నిత్యం తరించే అదృష్టం. తక్కువమందికి దొరికే అవకాశం. అది అధికారం కాదు, పదవి కాదు.. స్వామి సేవలో తరించే మహద్భాగ్యం.. అర్హులకు మాత్రమే దక్కాల్సిన అవకాశం. కానీ ఇప్పుడు అనర్హులకు, అవినీతి కేసులున్నవారికి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది టీటీడీ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో అనర్హులకు చోటు దక్కడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దొంగలముఠాను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించారన్నది విపక్షాల ఆరోపణ. ప్రతిపక్షాలు కాబట్టి అలా ఆరోపణలు చేయవచ్చేమో కానీ వారి వాదనలోనూ కాస్త నిజముంది. కొంతమందిపై తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి. ఈడీ కేసులున్నవారిని అసలు అలాంటి పవిత్రమైన పదవిలో నియమించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శరత్ చంద్రారెడ్డిని పాలకమండలి మండలి సభ్యుడిగా నియమించారు జగన్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడు. జైల్లో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తిని పాలకమండలికి పంపడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఆయన విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు కావొచ్చు కానీ టీటీడీ పదవికి మాత్రం తగినవాడు కాదు. అలాగే కేతన్ పరేఖ్. ఆయనపై గతంలో ఎన్నో ఆరోపణలున్నాయి. అయినా అధికార పార్టీ పట్టించుకోలేదు. అలాగే మరికొందరు కూడా టీటీడీ పాలకమండలికి తగినవారు కాదనే వాదనలున్నాయి. అసలు టీటీటీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి క్రిస్టియన్ అన్న వాదనలూ ఉన్నాయి. దానిపై కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చినా సీఎం జగన్ పట్టించుకోలేదు. ఛైర్మన్ గిరీ కట్టబెట్టారు. గతంలో బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డి నియామకంపై కూడా తీవ్రస్థాయి ఆరోపణలొచ్చాయి.

దైవభక్తి ఉన్నవారిని మాత్రమే టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించాలి. సంప్రదాయాలపై అవగాహన ఉండాలి. దైవసేవ చేయాలనే తపన ఉండాలి. నరుడి సేవే నారాయణ సేవ అని భావించాలి. దాన్ని పదవిలా చూడకూడదు. భగవంతుడు తమ భుజాలపై పెట్టిన బాధ్యతగా భావించాలి. కానీ ఇక్కడ మాత్రం అదో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. స్థాయి లేని వారిని తీసుకొచ్చి ఏడుకొండలపై కూర్చోబెడుతున్నారు. రాజకీయ అవసరాలతోనే నియామకాలు సాగుతున్నాయి. ఆలయ పవిత్రతను రోడ్డుకీడుస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి ఇద్దరు, ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు అంటూ రికమండేషన్ల ప్రకారం నియమించేస్తున్నారు కానీ వారు తగిన వారా కాదా అన్న విచారణే లేదు. పోనీ పాలకమండలి సభ్యులుగా నియామకమైన వారు దైవసేవలో తరిస్తున్నారా అంటే అదీ లేదు. కార్లపై బోర్డులు పెట్టుకోవడానికి, సిఫార్సుల లేఖల కోసమే వాడుకుంటున్నారు తప్ప తాము స్వామి సేవలో ఏం చేయగలమనే ఆలోచన ఏ మాత్రం చేయడం లేదు.

టీటీడీ పాలకమండలి సభ్యులను నియమించేటప్పుడు సీఎం జగన్.. తన ఆంతరంగిక కోటరీనే కాకుండా బయటవారిని కూడా కాస్త సంప్రదించి ఉంటే బాగుండేది. వివాదాలకు తావు లేకుండా వారిని నియమించి ఉంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు. అది తిరుమల తిరుపతి దేవస్థానమే కానీ జగన్ దేవస్థానం కాదని గ్రహిస్తే బాగుండేది. ఆలయ పవిత్రతను నిత్యం కాపాడేవారెవరున్నారో వెతికిపట్టుకుని నియమించి ఉంటే బాగుండేది. రాజకీయాల్లోనే చాలామంది మంచి వారున్నారు. అలాంటి వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సిందేమో. పోనీ తమ వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే కార్పొరేషన్ పదవుల వంటివి చాలానే ఉన్నాయి. శరత్ చంద్రారెడ్డి లాంటి వారిని అలాంటి వాటిలో నియమిస్తే ఎవరూ తప్పుపట్టేవారు కాదు.

దేవుడు దేవుడే. మనం ఆయవ సేవకులం. మనం ఆయన చెప్పినట్లు వినాలి తప్ప.. దేవుడ్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకోవడం తప్పు. తమవారు పదవిలో ఉన్నంత మాత్రాన కార్పొరేషన్ల లాగా దేవుడు కూడా తమ కంట్రోల్‌లో ఉంటాడనుకుంటే అది భ్రమే. ఎన్ని ఆటలైనా ఆడొచ్చు కానీ వెంకన్నతో మాత్రం పెట్టుకోకూడదన్నది నిజం. ఆయన జోలికి వెళ్లిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. అది గుర్తుంచుకుని పాలకమండలిని నియమిస్తే బాగుండేది.