ఒకప్పటిలా కాదు పవన్, జనసైనికులు.. రాజకీయం తెలుసుకున్నారు.. ఇప్పుడు పాలిటిక్స్ అంతుచూసే బాధ్యత తీసుకున్నారు. ప్రకటనల నుంచి నిర్ణయాల వరకు ప్రతీ విషయంలో పవన్ మాట చెప్తోంది అదే ! ఆంధ్రప్రదేశ్‌లో జనసేన రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే.. పార్టీ బలం చాలావరకు పెరిగిందిప్పుడు ! కారణం ఏదైనా వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత పెరిగింది.. ఐతే ఆ వ్యతిరేకత పూర్తి స్థాయిలో టీడీపీలోకి వెళ్లడం లేదు. జనసేన ఖాతాలోనూ కాస్త చేరుతోంది అది ! ఇదే పవన్‌కు, గ్లాస్ పార్టీకి ప్లస్ అవుతోంది.
2019 ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు.. అంటే దాదాపు 18లక్షల ఓట్లు వచ్చాయ్. ఐతే ఇప్పుడు ఆ బలం భారీగా పెరిగింది. 11శాతానికి జనసేన బలం పెరిగిందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఏడు సీట్లు గెలవడం ఖాయం అని సర్వేలు చెప్తున్నాయ్. ఐతే ఈ బలాన్ని మరింత పెంచేలా పవన్ కష్టపడుతున్నారు. సమావేశాలు, సమీక్షలు.. పలకరింపులు, పరామర్శలు.. ఎలాగోలా ఎప్పుడూ జనాల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఐతే గ్రౌండ్ లెవల్‌లో ఇప్పటికిప్పుడు బలమైన నేతలను తయారు చేయడం కష్టం కాబట్టి.. ఇతర పార్టీలో ఉన్న నాయకులకు గాలం వేస్తోంది జనసేన.
ఎన్నికల వేళ పలువురు నేతలు.. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నారు. టీవీ రామారావు, ఈదర హరిబాబు పవన్‌ను కలిసి గ్లాస్ తీర్థం పుచ్చుకున్నారు. కాండ్రు కమల కూడా అదే దారిలో ఉన్నారు. టీవీ రామారావు, కాండ్రు కమల.. ఇద్దరు వైసీపీ నేతలే కావడం హైలైట్. వైసీపీలో అసంతృప్తులు పీక్స్‌కు చేరాయ్. దాదాపు ప్రతీ జిల్లాలో నాయకుల మధ్యవిభేదాలు ఉన్నాయ్. వారందరినీ టార్గెట్ చేసే పనిలో పడింది జనసేన.
టీడీపీతో పొత్తు వ్యవహారంపై పవన్ దాదాపు క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగానే పోరు అన్నట్లుగా సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారమే ! ఐతే సింగిల్‌గా బరిలో దిగే పరిస్థితులు వచ్చినా.. బలంగా కనిపించాలని.. చేరికల మీద ఫోకస్ పెట్టారు పవన్. ముఖ్యంగా వైసీపీలో అసంతృప్తులను లక్ష్యం చేసుకొని.. వారికి రెడ్ కార్పెట్ పలకాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.