Kumaraswamy – KCR: కుమారస్వామిని మోసం చేసిన కేసీఆర్…!

సరైన సమయంలో నిధులు అందకపోవడమే జేడీఎస్‌ను ముంచేసినట్లుగా కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌తో తెగ చెప్పుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 09:17 AM IST

జేడీఎస్‌ అధినేత కుమారస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ మోసం చేశారా…? అసలు సమయంలో హ్యాండ్ ఇచ్చారా…? అవుననే అంటున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌… ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడీ న్యూస్‌ కన్నడ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అయిపోయింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కాంగ్రెస్‌, బీజేపీల సంగతి పక్కన పెడితే జేడీఎస్‌కు ముఖ్యంగా కుమారస్వామికి ఇవి చావోరేవో లాంటి ఎన్నికలు. అందుకే 90 ఏళ్ల వయసు దాటినా మాజీ ప్రధాని దేవెగౌడ ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. తమ కంచుకోట లాంటి ఓల్డ్‌ మైసూర్‌ ప్రాంతంలో ఈసారీ సత్తా చాటాలని కుమారస్వామి గట్టిగా పోరాడారు. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలోకి దిగారు. కానీ చివరి నిమిషంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితి.

ఎగ్జిట్‌పోల్స్ తర్వాత మాట్లాడిన కుమారస్వామి తమ పార్టీ గెలిచే నియోజకవర్గాల్లోనూ నిధుల్లేక నష్టపోయామన్నారు. ఆశించిన స్థాయిలో తమ అభ్యర్థులకు నిధులు సమకూర్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే అవకాశమున్న సుమారు 25నియోజకవర్గాల్లో నిధుల్లేకపోవడం వల్లే నష్టం జరిగిందన్నది ఆయన బాధ. కుమారస్వామి కామెంట్స్‌పై ఇప్పుడు హాట్‌ డిస్కషన్ నడుస్తోంది. కుమార స్వామికి ఎవరు హ్యాండ్ ఇచ్చారు ? పార్టీకి నిధుల లేమి సమస్య వచ్చిందని ఎందుకు అన్నారు? అసెంబ్లీ ఎన్నికలకు సాయం చేస్తామన్నవారు సైలెంట్‌గా ఉండి పోవడంతోనే కుమారస్వామికి ఈ పరిస్థితి వచ్చిందా ? అన్న ప్రశ్నలు తెగ షికారు చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కుమారస్వామి రాసుకు పూసుకు తిరిగారు. పార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంటే ఉన్నారు. కేసీఆర్ కూడా బెంగళూరు వెళ్లి దేవెగౌడతో చర్చలు జరిపారు. అంతా కలిసి భోజనాలు కూడా చేశారు. ఆ సమయంలో వీళ్ల మాటలు వింటే ఒకరికోసం ఒకరు పుట్టినట్లుగా భావించారు. కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని అంతా భావించారు. అయితే బీఆర్ఎస్‌ మాత్రం బరిలో నిలవలేదు. దీంతో కుమారస్వామికి కేసీఆర్ మద్దతుగా నిలుస్తారని ఎన్నికలకు ఆర్థిక సాయం చేస్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్‌ కూడా దీనిపై గతంలో హామీ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే కుమారస్వామి కేవలం డబ్బుల కోసమే కేసీఆర్ పంచన చేరినట్లు కూడా చెప్పుకున్నారు. అయితే అసలు సమయంలో కేసీఆర్‌ నుంచి జేడీఎస్‌కు తగిన నిధులు అందలేదని తెలుస్తోంది. ఆ డబ్బులు వస్తాయన్న ఆశతోనే కుమారస్వామి వేరే ఏర్పాట్లు చేసుకోలేదని అదే కొంప ముంచిందని కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రచారాలు మాత్రమే. ఇది ఎంతవరకు వాస్తవమన్నది ఎవరికీ తెలియదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరిగాయి. అవేం అప్పటికప్పుడు వచ్చినవి కాదు. దీంతో కుమారస్వామి మొదట్నుంచి ఎందుకు అలర్ట్‌ కాలేదన్న ప్రశ్న వస్తోంది. ఎన్నికలకు ఖర్చు చేసే నిధుల సమీకరణ విషయంలో ఎక్కడ అంచనా తప్పారు అన్నది హాట్ టాపిక్ అయింది. కుమారస్వామి లాంటి సీనియర్‌ పొలిటీషియన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. నిధులు అందుతాయన్న భరోసాతో నిర్లక్ష్యంగా ఉన్నారా…?

కర్ణాటక ఎన్నికలు ఈసారి బాగా కాస్ట్‌లీ అయిపోయాయి. చావోరేవో కావడంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ కోట్లు కుమ్మరించాయి. నోట్ల వరద పారించాయి. కానీ జేడీఎస్ ఆ స్థాయిలో తనకు పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఖర్చు పెట్టలేకపోయింది. ఇది ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. వక్కలిగలు ఎక్కువగా ఉండే మైసూర్‌బెల్ట్‌ జేడీఎస్‌కు కంచుకోట. ఆ పార్టీ గెలిచే సీట్లన్నీ దాదాపు ఇక్కడే ఉంటాయి. అయితే ఈసారి కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ రూపంలో ముప్పు వచ్చిపడింది. ఆయన కూడా వక్కలిగనే కావడంతో ఆ పార్టీ ఓట్లలో కొంతమేర చీలిక వచ్చినట్లు భావిస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే కోట్లు ఖర్చు పెట్టక తప్పదని కుమారస్వామీ గుర్తించారు. అందుకు తగ్గట్లుగా డబ్బులొస్తాయని భావించారు. హంగ్ ఏర్పడితే తామే కింగ్‌ మేకర్‌ అవుతామని కలలు కన్నారు. కానీ ఒక్క స్ట్రోక్‌తో కలలు కల్లలయ్యాయి. కనీసం ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ప్లాన్‌-బీని సిద్ధం చేసుకోకపోవడం జేడీఎస్‌ను ముంచేసింది. దీంతో పార్టీ నుంచి అంతంతమాత్రంగా అందిన ఫండ్స్‌తో పాటు సొంతసొమ్ము బయటకు తీయాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే సరైన సమయంలో నిధులు అందకపోవడమే జేడీఎస్‌ను ముంచేసినట్లుగా కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌తో తెగ చెప్పుకుంటున్నారు.